ఎవరో ఒకరి ద్వారా చేదు అనుభవం ఎదురైతే.. ఆ వర్గానికి చెందిన వారందరినీ దూరం పెట్టడం వివేకం అనిపించుకుంటుందా? అనవసరమైన భయం అనిపించుకుంటుందా? ఈ విషయంలో ఎవ్వరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు గానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం.. అలాంటి భయంతో సతమతం అవుతున్నారు.
ఆయనకు ప్రస్తుతం ‘ఐవైఆర్ ఫోబియా’ పట్టుకుంది. అవును.. ఇది సరికొత్త ఫోబియా..! మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీ కృష్ణారావు పదవీ విరమణ తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షుడిగా నియమితులై... తనకు చుక్కలు చూపించి, తన పరువును బజార్లో పెట్టిన వైనం చంద్రబాబు మరచిపోలేకపోతున్నారు. ఆ ఫోబియాతో.. అసలు మాజీ ఐఏఎస్ లు అంటేనే ఆయన జడుసుకుంటున్నారని సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వంలో ఉండే పార్టీలతో సన్నిహితంగా మెలిగే సీనియర్ ఐఏఎస్ అధికార్లకు, వారు పదవీ విరమణ చేసిన తర్వాత.. వారి సేవలను వాడుకునే మిష మీద గౌరవనీయ పదవులను కట్టబెడుతూ ఉండడం కద్దు. తెలంగాణలో కూడా ఈ రీతిగా కేబినెట్ మంత్రి స్థాయి అధికారం వెలగబెడుతున్న మాజీ ఐఏఎస్ లు ఉండనే ఉన్నారు.
ఏపీలో కూడా ఆ రీతిగా మాజీ ఐఏఎస్ లకు పదవులు ఇవ్వడం సాధారణంగా జరిగేదే! అయితే ఐవైఆర్ కృష్ణారావుకు పదవి ఇచ్చిన తర్వాత.. ఆయన మొండిగా, ముక్కుసూటిగా తన గురించి వ్యాఖ్యలు చేయడం చూసి, సాధారణ రాజకీయ నాయకుల్లాగా ఈ బ్యూరోక్రసీ నుంచి వచ్చిన వాళ్లు.. లౌక్యం పాటించరేమో అని చంద్రబాబుకు భయం పట్టుకున్నదని పలువురు అంటున్నారు.
వివిధ నామినేటెడ్ పోస్టులను మీకే కట్టబెడతానంటూ ఇదివరలో ఆయన కొందరు మాజీ ఐఏఎస్ లకు చేసిన వాగ్దానాల్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయినా, ఎవరో కృష్ణారావు లాంటి ఒక ఐఏఎస్ తేడాగా వ్యవహరించినంత మాత్రాన ప్రతి మాజీ ఐఏఎస్ అధికారీ అదే తీరుగా చుక్కలు చూపిస్తారని చంద్రబాబు భయపడుతుండడాన్ని ఇన్నాళ్లూ ఆశలు పెంచుకున్న వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
అంతగా వారు అవసరం అనుకుంటే.. అంత కీలకం కాని పదవుల్ని పంచిపెడదామని, అంతే తప్ప.. కీలక పదవులు కట్టబెటిట కష్టాలు కొనితెచ్చుకోవడం ఎందుకని చంద్రబాబు భావిస్తున్నారట. ఔరా! ఐవైఆర్ దెబ్బ బాబుగారికి ఎంత గట్టిగా తగిలినట్టున్నదో కదా!!