ఇప్పుడు కాదు అప్పుడెప్పుడో.. “నరసింహా’’ సినిమా వచ్చినప్పటి డైలాగునే రిపీట్ చేశాడట సూపర్ స్టార్ రజనీకాంత్. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి రావడం జరుగుతుందని రజనీకాంత్ వ్యాఖ్యానించాడట. ఈ సారి మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం సన్నిహితుడు అయిన పొన్ రాజ్ తో రజనీకాంత్ ప్రత్యేకంగా సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రానికి రెడీ అవుతున్న తరుణంలోనే ఈ సమావేశం జరిగిందనే ప్రచారం జరుగుతోంది.
మరి నిజంగానా? సూపర్ రాజకీయాల్లోకి వస్తారా? అనే ఆసక్తి అధికం అవుతున్న నేపథ్యంలో.. “దేవుడు ఆదేశిస్తే..’’ అనే మాట కూడా ప్రచారంలోకి వచ్చింది. రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రం గురించి తమిళనాడులోని ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ దగ్గర నుంచి బయటి వాళ్లు కూడా ఆసక్తిగానే చూస్తున్నారు. ఇదే సమయంలో రజనీ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మేలు అనే అభిమానులూ ఉన్నారు.
ఇక రజనీ విషయానికి వస్తే ఆయన ఆచితూచి స్పందిస్తున్నారు. దాదాపు దశాబ్దంన్నర నుంచి ఈ అంశం గురించి ఔను అనకుండా, కాదు అనకుండా ఆయన బండిలాగిస్తున్నారు. రెండేళ్ల కిందట రజనీ బీజేపీలో చేరే అవకాశాలున్నాయనే ప్రచారమూ గట్టిగా జరిగింది. రజనీని చేర్చుకుని కమలం పార్టీ అక్కడ బలోపేతం అయ్యే వ్యూహంతో ఉందని, మోడీ –అమిత్ షాలు ఈ విషయంలో చొరవ చూపిస్తున్నారనే ప్రచారమూ జరిగింది.
అయితే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయినా ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయినా రజనీ పొలిటికల్ ఆరంగేట్రం జరగలేదు. ఇప్పుడు మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. మరి ఈ సారి ఏం జరుగుతుందో!