సినిమా స్టార్లు.. పేర్ల కహానీలు!

సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖుల అసలు పేర్లకు వారు ఫేమస్ అయిన పేర్లకు ఏమాత్రం సంబంధం లేదనేది కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం ఏమీ కాదు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి చిరంజీవి వరకూ రజనీకాంత్ నుంచి మమ్ముట్టీ వరకూ.. ప్రీతీజింతా నుంచి సన్నీలియోన్ వరకూ.. వీళ్ల అసలు పేర్లు ఒకటైతే, తెరపై పడే పేర్లు మాత్రం వేరు. సినీ ఇండస్ట్రీలో గుర్తింపుకు సంపాదించుకుంటున్న తరుణంలో వీళ్ల పేర్ల మార్పిడి జరిగింది. జనాల్లో నోళ్లకు సులభంగా తిరిగే పేర్లను పెట్టుకున్న వాళ్లు కొందరైతే, అసలు పేర్లలో కొంత మొరటుదనం ఉండటం, కులంపేర్లు ఇండికేటర్లుగా ఉండటం వంటి కారణాల రీత్యా పేర్లను మార్చుకున్న వాళ్లు మరికొందరు. ఇలా పేర్లను మార్చుకుని ఫేమస్ అయిన వాళ్ల అసలు పేర్లు తెలుసుకోవడం ప్రతి తరానికీ ఒక ఆసక్తికరమైన అంశమే. గత ముప్పై ఏళ్లలో చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే విషయం బోలెడన్ని సార్లు అచ్చు అయి ఉంటుంది. కొన్ని సినిమాల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ఎన్నిసార్లు చెప్పినా మరోసారి చెప్పుకునే ఆసక్తికరమైన ముచ్చట్లు ఇవి.

భక్తవత్సల నాయుడు అనే తనకు మోహన్ బాబుగా నామకరణం చేసింది, తనకు ఆ గుర్తింపు ద్వారా కొత్త జన్మను ఇచ్చింది తన గురువు దాసరి నారాయణరావు అని కలెక్షన్ కింగ్ ప్రతి సందర్భంలోనూ చెబుతూనే ఉంటారు. అలాగే దక్షిణాదిలో ఇలా పేర్లను మార్చడంలో కొంతమంది దర్శకులకు చాలా ప్రత్యేకత ఉంది. దాసరి చాలా మంది నటులకు స్క్రీన్ నేమ్స్‌ను సజెస్ట్ చేసిన దాఖలాలున్నాయి. అలాగే బాలచందర్ కూడా ఈ విషయంలో ప్రావీణ్యుడే. ఆయన పెట్టిన పేర్లు తర్వాతి కాలంలో చాలా ఫేమస్ అయ్యాయి. భారతి రాజా చాలా మంది నటీమణుల పేర్లను మార్చేశారు. వారి అసలు పేర్లను పక్కన పెట్టి ‘ఆర్’ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే పేర్లను పెట్టారాయన. రాధిక దగ్గర నుంచి రంజిత, రోజాల వరకూ ఆయన పెట్టిన పేర్లే. వీళ్ల అసలు పేర్లు వేరే. ఆర్ అనే అక్షరంతో వారికి నామకరణం చేశారు భారతిరాజా.

స్క్రీన్ నేమ్స్‌తో ఎంత ఫేమస్ అయినా వారి అసలు పేర్లను కూడా మరవదు మీడియా. ఏ సందరా్భల్లో వారి గురించి రాస్తున్నా.. అసలు పేర్లను ప్రస్తావిస్తుంటారు. ఇలా అసలు పేర్లను ప్రస్తావించడం కొంతమంది సెలబ్రిటీలకు ఇష్టం లేకపోయినా ఇది కొనసాగుతూ ఉంటుంది. ఆ మధ్య ప్రఖ్యాత బాలీవుడ్ రచయిత గుల్జార్ ఈ విషయంలో తన అసంతప్తిని వ్యక్తం చేశారు. తను మరిచిపోయిన పేరుతో తనను సంబోధించడాన్ని, తన గురించి రాసేటప్పుడు ఆ పేరును ప్రస్తావించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుల్జార్‌గా ప్రసిద్ధులు అయిన ఆయన పేరు సంపూరణ్ సింగ్ కల్రా. ఒక సన్మాన సభలో ఆయనకు స్వాగతం పలుకుతూ.. ‘సంపూరణ్ సింగ్ కల్రా’కు స్వాగతం అని రాశారు నిర్వాహకులు. ఆ కార్యక్రమ వేదిక వస్తూనే ఆ విషయాన్ని గమనించిన గుల్జార్ తీరా స్టేజ్ ఎక్కి తన ప్రసంగాన్ని మొదలుపెట్టడంతోనే పెద్ద క్లాస్ పీకారు.

తను గుల్జార్.. సంపూరణ్ సింగ్ కాదు అని స్పష్టం చేస్తూ, ఆ పేరు కూడా తనకు గుర్తుకు లేదని, అలాంటప్పుడు ఆ పేరును మీరెలా రాస్తారు? అంటూ నిర్వాహకులను ఆన్ ద స్పాట్ నిలదీశారాయన. ఏదో ఉత్సాహం కొద్దీ ఆ పని చేసిన నిర్వాహకులు నీళ్లు నమిలారు. తనను సన్మానించినందుకు కతజ్ఞతలు చెప్పడానికి బదులుగా.. ఆ పేరుతో పెట్టి వెల్కమ్ బోర్డ్ రాసినందుకు తిట్టేసి వెళ్లిపోయారాయన.

ఇలా ఉంటాయి సినీ ప్రముఖులతో వ్యవహారాలు. ఈ సంగతి ఇలా ఉంటే... కొంతమంది సినిమా వాళ్ల విషయంలో ఇంకో కన్‌ప్యూజన్ కూడా ఉంటుంది. వీళ్లు వేర్వేరు పేర్లతో ఫేమస్. ఒక్కో ఇండస్ట్రీలో వీరు ఒక్కో పేరుతో చలామణి అవుతూ ఉంటారు. రెండు మూడు భాషల ప్రేక్షకుల మధ్య ఫేమస్ అయిన వీళ్లు ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో పేరుతో గుర్తింపును నోచుకున్నారు.

ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు. ఎం.ఎం.కీరవాణి.. మనకైతే కీరవాణి కానీ హిందీలో అయితే ఈయన హిందీ సినిమాలకు సంగీతాన్ని ఇచ్చిన సందరా్భల్లో ఎం.ఎం.క్రీమ్ అని పడుతుంది. తమిళ సినిమాల్లో ఈయన పేరు మరకతమణిగా పడుతుంది. అలాగే వేదనారాయణ అనేది కూడా కీరవాణి స్క్రీన్ నేమ్‌లలో ఒకటి. తమిళ నటుడు, ఒకప్పటి స్టార్ కార్తీక్. తెలుగులో అన్వేషణ, అభినందన వంటి సినిమాల్లో నటించాడు కార్తీక్. వంశీ దర్వకత్వంలో వచ్చిన అన్వేషణలో ఈ హీరో పేరు ‘మురళి’ అని పడుతుంది. ఆ తర్వాతి కాలంలో ఈయన నటించిన స్ర్టైట్ తెలుగు సినిమాల్లోనూ, తమిళ డబ్బింగ్ సినిమాల టైటిల్ కార్డ్స్‌లోనూ ‘కార్తీక్’ అనే పడుతుంది!

మరో తమిళ తంబీ శ్రీరామ్ ది ఇంకో కథ. ఇతడు తమిళం వరకూ ‘శ్రీకాంత్’ తెలుగులో మాత్రం ‘శ్రీరామ్’. తమిళ సినిమాల్లో నటించడం ద్వారా తెలుగులోకి పరిచయం అయిన ఇతడు ‘శ్రీకాంత్’ పేరుతో తెలుగువారికి పరిచయం కావడానికి ఇబ్బంది ఏర్పడింది. అప్పటికే ఆ పేరుతో తెలుగులో శ్రీకాంత్ ఉండటంతో.. పేరులో కొంచెం మార్పు చేసి ‘శ్రీరామ్’గా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి తెలుగులో శ్రీరామ్‌గా తమిళంలో శ్రీకాంత్‌గా కొనసాగుతున్నాడితను.

అలాగే తెలుగు హీరో శ్రీకాంత్ భార్య ‘ఊహ’కు కూడా వేర్వేరు పేర్లున్నాయి. అనేక తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఊహకు అక్కడి పేరు ‘శివరంజని’. 90లలో వచ్చిన అనేక తమిళ సినిమాల్లో ఊహ పేరు ‘శివరంజని’ అని పడుతుంది. తెలుగులో మాత్రం ఈమె ‘ఊహ’నే. అలాగే మరో పాతకాలం హీరోయిన్ రజనీకీ రెండు పేర్లున్నాయి. తెలుగులో అహనాపెళ్లంట వంటి ఆల్‌టైమ్ క్లాసిక్‌లో నటించింది రజనీ. తమిళంలో రజనీ అంటే ఎవరో వేరే చెప్పనక్కర్లేదు. మరి ఈ ఇబ్బంది ఉంటుందనే అనుకున్నారో ఏమో కానీ.. ఈమెను తమిళంలో అప్పట్లో వేరే స్క్రీన్ నేమ్‌తో వ్యవహరించారు. ఆ పేరు ‘శశికళ’. అలాగే భానుప్రియ చెల్లెలు విషయంలో కూడా వేర్వేరు పేర్లున్నాయి. వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఆమె పేరు ‘నిశాంతి’ అని పడుతుంది. అయితే కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించిన ఈమె అక్కడ ‘శాంతి ప్రియ’గా పరిచయస్తురాలు.

ఇలా ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో పేరుతో చెలామణి అయిన వారే కాకుండా... చాలా సంవత్సరాల పాటు ఒక పేరుతో కాలం గడిపి మళ్లీ పేర్లు మార్చుకున్నవాళ్లూ బోలెడంత మంది. రాయ్ లక్ష్మి వంటి వాళ్లే కాదు.. కొంతమంది హీరోలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆర్యన్ రాజేష్, దీపక్ వంటి ఒకటీ రెండు చిత్రాల హీరోలూ పేర్లు మార్చుకున్నవాళ్లే!  తెలుగు సీనియర్ నటుడు నరేష్ ఆ మధ్య తన పేరు మార్చుకున్నట్టుగా ప్రకటించారు. తనను ‘విజయ కష? నరేష్’గా సంబోధించాలని ఆయన కోరారు. 

అయితే.. సినిమాల టైటిల్ కార్డ్స్‌లో కూడా ఆయన పేరు నరేష్‌గానూ పడుతుంటుందిప్పటికీ. ఇలా పేరు మార్చుకున్న ప్రముఖుల్లో తారకరత్న కూడా ఉన్నాడు. తనను ‘ఎన్టీఆర్’ అని పిలవాలని ఆ మధ్య ఒక ప్రెస్‌నోట్ రిలీజ్ అయ్యింది ఈయన పేరు మీద. కానీ అది కూడా జరుగుతున్నట్టుగా లేదు. తమిళ హీరో శింబుది కూడా ఇదే గోల. శిలంబరసన్ అనే తన పేరును శింబుగా మార్చుకున్న ఇతడు ఆ మధ్య తన పేరును మార్చుకున్నానని ప్రకటించాడు. ఇకపై తనను అంతా ‘ఎస్‌టీఆర్’ అని పిలవాలని ప్రకటించాడు. బహుశా ఆ ప్రకటన శింబుకు కూడా గుర్తున్నట్టుగా లేదు. ఇక జనాలు ఏం గుర్తు పెట్టుకొని పిలుస్తారు?

Show comments