డిస్కో డాన్సర్‌కి ఏమయ్యింది.?

మిధున్‌ చక్రవర్తి.. బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరో.. డిస్కో డాన్సర్‌. బాలీవుడ్‌కి సరికొత్త డాన్సుల్ని పరిచయం చేసిన ఘనత మిధున్‌ చక్రవర్తికే దక్కుతుంది. వయసు మీద పడిందంటే ఒప్పుకునేవాడు కాదాయన. కానీ, అనారోగ్య కారణాల్ని చూపుతూ మిధున్‌ చక్రవర్తి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. 2014లో రాజ్యసభకు ఎంపికైన మిధున్‌ చక్రవర్తి, మూడు నాలుగు రోజులు మాత్రమే సభా కార్యకలాపాలకు హాజరవడం గమనార్హం. 

పశ్చిమబెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌, మిధున్‌ చక్రవర్తిని రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ఆయన రాజీనామా లేఖ అందిందనీ, ఆయనతో పార్టీ సత్సంబంధాలు కొనసాగుతాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రకటించింది. అయితే, మిధున్‌ చక్రవర్తి ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి శారదా చిట్‌ ఫండ్‌ స్కామ్‌ ప్రధాన కారణమన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ కేసులో మిధున్‌ చక్రవర్తి విచారణను కూడా ఎదుర్కొన్నారు. 

ఇదిలా వుంటే, పవన్‌కళ్యాణ్‌ - వెంకటేష్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'గోపాల గోపాల' సినిమాలో లీలాధరస్వామిగా మిధున్‌ చక్రవర్తి నటించిన విషయం విదితమే. 

మొత్తమ్మీద, రాజకీయ కారణాలతో ఎంపీ పదవికి రాజీనామా చేసిన మిధున్‌ చక్రవర్తి, అనారోగ్య కారణాలతోనేనని వెల్లడించడంతో ఒక్కసారిగా బాలీవుడ్‌ విస్తుపోయింది. ఆయన ఆరోగ్యంపై పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఆరా తీశారు. అయితే, మిధున్‌ చక్రవర్తి క్షేమంగానే వున్నారని బాలీవుడ్‌లో ఆయనకు అత్యంత సన్నిహితులైన పలువురు సినీ ప్రముఖులు చెబుతున్నారు. దాదాపు 350 సినిమాల్లో నటించారు మిధున్‌ చక్రవర్తి.

Show comments