నో సెకెండ్‌ డైలాగ్‌.!

మొహమాటానికైనాసరే ఇంకో డైలాగ్‌ చెప్పడానికి ఇష్టపడ్డంలేదు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ. విభజనతో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందని ఒప్పుకుంటున్నారుగానీ, ఆ నష్టాన్ని పూడ్చేందుకు ఏమేం చర్యలు తీసుకుంటున్నారో, తీసుకుంటారో మాత్రం చెప్పడంలేదు. మళ్ళీ మళ్ళీ అదే మాట, ఎన్నిసార్లయినా ప్రశ్నించుకోండి, నా దగ్గర వున్నది ఒకే ఒక్క సమాధానం.. అంటున్నారు అరుణ్‌ జైట్లీ. 

ప్రత్యేక హోదా అంశాన్ని తొలుత క్రితం మీరే ప్రస్తావించారు కదా.? అని ప్రశ్నిస్తే, దానికి ఆయన నోట సమాధానం మాత్రం దొరకదు. ఈ మధ్యన అరుణ్‌ జైట్లీ కొత్త పల్లవి అందుకున్నారు. 'ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం.. త్వరలోనే సమస్యకు పరిష్కారం కనుగొంటాం..' అని. ఇక్కడ సమస్య, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాదు, పెద్దల సభగా పిలవబడే రాజ్యసభతో. 

రాజ్యసభ సాక్షిగా, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ని ఇదే అరుణ్‌ జైట్లీ, ఆయనతోపాటు వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని నిలదీశారు. ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్‌, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రకటించారు. దాంతోపాటుగా మొత్తం ఆరు అంశాలతో కూడిన హామీల్ని రాజ్యసభ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇచ్చింది. కాబట్టి, రాజ్యసభలో ఇచ్చిన హామీకి విలువ వుంటుందా.? లేదా.? అన్న ప్రశ్నకు సమాధానం రాజ్యసభకి కేంద్ర, ఆర్థిక మంత్రిగా అరుణ్‌ జైట్లీ ఇచ్చి తీరాలి. కానీ, ఆయన ససేమిరా అంటున్నారు. 

తాజాగా ఈ రోజు లోక్‌సభలో, వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీశారు. ఆ పార్టీ ఎంపీలంతా, లోక్‌సభలో ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేపట్టే సరికి, స్పీకర్‌ రాజమోహన్‌రెడ్డికి మాట్లాడే అవకావమిచ్చారు. ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారుగానీ, అరుణ్‌ జైట్లీ నుంచి సరైన సమాధానం మాత్రం రాబట్టలేకపోవడం గమనార్హం. 

మళ్ళీ అదేమాట, 'ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం.. ఆ సంప్రదింపులు చివరి ధవలో వున్నాయి..' అని మాత్రమే అరుణ్‌ జైట్లీ సెలవిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాదన చూస్తే, 'ప్రత్యేక హోదా సంజీవని కాదు..' అనే వుంది. ప్రత్యేక హోదా అవసరం లేదంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో, అరుణ్‌ జైట్లీ సంప్రదింపులు జరపడానికేముంది.? 'వాళ్ళు వద్దంటున్నారు, మేం ఇవ్వలేం..' అనేయడం చాలా సింపుల్‌. కానీ, ఇక్కడ కర్ర విరగకూడదు.. పాము చావకూడదు. 

రాజ్యసభలో జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందేసింది. లోక్‌సభలోనూ నేడు బిల్లుని ప్రవేశపెట్టారు అరుణ్‌ జైట్లీ. అదెలాగూ పాసయిపోతుందనుకోండి.. అది వేరే విషయం. ఆ తర్వాత, ఇక పార్లమెంటు సమావేశాల్ని ఎక్కువ రోజులు నడిపేందుకు బీజేపీ సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. నడిపినా, చిన్న గందరగోళం తలెత్తితే వాయిదాల ప్రసహనం మొదలవుతుంది.. పుణ్యకాలం అటకెక్కిపోతుంది. 

మరి, ప్రత్యేక హోదా వ్యవహారం మాటేమిటి.? ప్రత్యేక హోదాకి సంబంధించి కేంద్రాన్ని నిలదీయడానికి పార్లమెంటుని వేదికగా చేసుకోవాలంటే, వచ్చే సమావేశాలదాకా ఆగకపోవచ్చు. ఈలోగా కేంద్రం, ప్రత్యేక హోదా విషయాన్ని పూర్తిగా అటకెక్కించేస్తుంది. మోడీ సర్కార్‌ స్కెచ్‌ అదిరింది కదూ.!

Show comments