దీక్షకి విలువ లేదాయె.. పాదయాత్ర పరువుపాయె.!

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తానంటున్నారు. అక్టోబర్‌ 27 నుంచి ఆరు నెలలపాటు ఆయన పాదయాత్ర కొనసాగనుంది. సుమారు 3వేల కిలోమీటర్ల మేర తన పాదయాత్ర సాగుతుందని వైఎస్‌ జగన్‌ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. తామేం తక్కువ తిన్లేదంటూ అధికార తెలుగుదేశం పార్టీ 'పాదయాత్ర' అనకుండా, 'ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ' అనే పల్లవి అందుకుంది. ప్రతిపక్షానికి కౌంటర్‌ ఇవ్వడం టీడీపీ ఉద్దేశ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! 

అసలు విషయానికొస్తే, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం కూడా పాదయాత్ర చేస్తానంటున్నారు. ఇదిప్పుడు ఆయన కొత్తగా చెబుతున్న మాటకాదు.. చాలాకాలంగా పాదయాత్ర పేరుతో ఊరిస్తున్నారాయన. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసమంటూ ముద్రగడ పద్మనాభం 'కాపు ఉద్యమాన్ని' భుజానికెత్తుకున్నారు. ఏం లాభం.? ముద్రగడ ఎంత అరిచి గీ పెడుతున్నా చంద్రబాబు సర్కార్‌ పట్టించుకోవడంలేదాయె.! 

నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో ఎవరన్నా నిరాహార దీక్ష చేస్తామంటే, జనానికి ఫక్కున నవ్వొచ్చేస్తోంది.. పాదయాత్ర చేస్తామన్నా అదే పరిస్థితి. ఇంతలా, రాజకీయ నాయకుల నిరాహార దీక్షలు, పాదయాత్రలు అపహాస్యం పాలవడానికి కారణం ముద్రగడ పద్మనాభం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే, నిరాహార దీక్ష చేస్తానంటారు.. ఇంట్లోకెళ్ళి తలుపులు గడియ పెట్టుకుంటారు.. ఇదేం నిరసనో ఎవరికీ అర్థంకాదు. ఆయన మాత్రం, ఇదోటైపు వెరైటీ అనుకుంటారు. పాదయాత్ర అయినా అంతే, ఇంకొకటైనా అంతే.. గృహ నిర్బంధం విషయంలో ముద్రగడ దగ్గరకొచ్చేసరికి చిత్ర విచిత్రంగా పరిణామాలు మారిపోతుంటాయి. 

ఆరు నూరైనా నూరు ఆరైనా ఈసారి పాదయాత్ర చేస్తానని తెగేసి చెప్పారు తాజాగా ముద్రగడ పద్మనాభం. అరెస్టు చేసినాసరే, పాదయాత్ర ఆగదట. అదెలా.? ఏమో, జైల్లోనే ఆయన ఈ చివరి నుంచి ఆ చివరిదాకా పాదయాత్ర చేసేస్తారేమో.! ఇలాంటివారి వల్లే, నిరాహార దీక్షలన్నా, పాదయాత్రలన్నా విలువ లేకుండా పోతోంది.

Show comments