సుజనాకు అనుకూలంగా ఛానల్, వ్యతిరేకంగా మరోటి!

ఉమ్మడిగా అన్ని చానళ్లూ కలిసి తెలుగుదేశం పార్టీనే సమర్థిస్తాయి కానీ.. అంతర్గతంగా ఒక్కో వార్తా చానల్ ఆ పార్టీల్లోనే వేర్వేరు ప్రాధాన్యతలున్నాయి. పచ్చమీడియాలో భాగం అయిపోయిన ఈ ఛానళ్లు ఒక్కోసారి తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నేతలను అమాంతం ఆకానికెత్తేస్తాయి, మరోసారి వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తాయి. ఆ పొగడ్తలూ నమ్మశక్యంగా ఉండవు, విమర్శలూ కావాలని చేస్తున్నట్టుగానే ఉంటాయి. దీంతో ఈ ఛానళ్లు ఇట్టే పట్టుబడుతున్నాయి!

ఉదాహరణకు కేంద్ర మంత్రి సుజనా చౌదరి విషయంలో తెలుగుదేశం అనుకూల మీడియాలోనే చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కోసమే పని చేసే ‘దమ్మున్న’ ఛానల్, “మెరుగైన’ సమాజం కోసం అవిశ్రాంతంగా పాటు పడే మరో ఛానల్ పదే పదే సుజనను టార్గెట్ గా చేసుకొంటూ ఉంటాయి! చౌదరి తెలుగుదేశం వ్యక్తే, ఈ మీడియాధినేతల సామాజికవర్గానికి చెందిన వ్యక్తే అయినా.. వీళ్ల బంధాలు ఎక్కడో బెడిసి కొట్టాయి! దీంతో అవకాశం వస్తే.. చౌదరిపై విరుచుకుపడుతూ ఉంటాయి ఈ ఛానళ్లు!

సుజనా చౌదరి బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టాడని.. వ్యాపారాల విషయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డాడని.. పతాక శీర్షికల్లో వార్తలిస్తూ ఉంటాయి ఈ రెండు మీడియా వర్గాలూ. సుజన మంత్రి పదవి పోవడం కూడా ఖాయమని మొన్నామధ్య గట్టి ప్రచారం చేసింది కూడా ఛానళ్లే. ఇక ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో జరిగిన అలజడి నేపథ్యంలో కూడా సుజనను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నాయి ఈ మీడియా వర్గాలు. సుజన మోడీని పొగుడుతున్నాడని, ప్రత్యేక హోదా అంశంపై గట్టిగా వాయిస్ వినిపించడం లేదని.. ఈ ఛానళ్లు విశ్లేషించాయి.

ఇక్కడ కట్ చేస్తే.. రెండో రోజున  సుజనాకు అనుకూలంగా ఒక ఛానల్ పగలంతా గట్టిగా ప్రచారం చేసి పెట్టింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ ట్రూప్ లో చేరిన ఒక ఛానల్ సుజనను ఒక రేంజ్ లో కీర్తిస్తోంది. ఎంతగా అంటే.. ప్రత్యేక హోదా గురించి రాజ్యసభలో చౌదరి అద్భుతంగా వాణి వినిపించాడని, చరిత్రలో ఈ విధంగా వాదించిన వారు మరొకరు లేరని, పార్లమెంటు చరిత్రలోనే చౌదరి ప్రసంగం ఒక చరిత్ర అని.. మొదలు పెట్టింది ఈ ఛానల్. అక్షరాలా ఇవే వాక్యాలను ఉపయోగించి ఈ ఛానల్ చౌదరిని ఆకాశానికెత్తింది!

మరి పచ్చ బ్యాచ్ లోనే ఇలాంటి వైరుధ్యాలు కనిపించడం విశేషం. చౌదరి చచ్చుగా మాట్లాడాడని రెండు ఛానళ్లు, చౌదరి సూపరని మరో ఛానల్ వాదిస్తున్నాయి. మరి ఇందులో ఏం లెక్కలున్నాయో!

Show comments