జయకు భారతరత్న… నిరసన తమిళనాడు నుంచే!

దక్షిణాది ప్రాంతీయ పార్టీల దివంగత అధినేతల విషయంలో భారతరత్నల లొల్లి మరోటి మొదలైంది. ఇటీవల తుదిశ్వాస విడిచిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను భారతరత్నగా ప్రకటించాలని ఇప్పటికే ఆ పార్టీ వారి నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అన్నాడీఎంకే తన వాయిస్ ను వినిపించగా.. ఇటీవల ప్రధానితో సమావేశం అయినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం జయకు భారతరత్న అవార్డును ప్రకటించాని విన్నవించుకున్నారు.

ఆ విజ్ఞాపన పట్ల ప్రధానమంత్రి కూడా సానుకూలంగా స్పందించాడని తమిళనాడు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మరి నిజంగానే జయను భారతరత్నంగా ప్రకటిస్తారో లేదో తెలీదు కానీ.. ఈ విషయంలో నిరసన కూడా తమిళనాట నుంచే వినిపిస్తోంది. జయను భారతరత్నగా ప్రకటించాల్సిన అవసరం లేదని పీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి రాందాసు అంటున్నాడు.

తన జీవిత చరమాంకం వరకూ అవినీతి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగి, దోషిగా శిక్షను ఎదుర్కొని జైలుకు వెళ్లిన వ్యక్తిని భారతరత్నగా ఎలా ప్రకటిస్తారు? అని రాందాసు ప్రశ్నిస్తున్నారు. జయకు భారతరత్న అవార్డును ప్రకటించడానికి వీల్లేదని ఈయన అంటున్నాడు.

తమిళనాడు రాజకీయాల గురించి స్పందిస్తూ… అన్నాడీఎంకే నేతలు అంతా కలిసికట్టుగానే ఉంటారని రాందాసు అభిప్రాయపడ్డారు. అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే వారికి అది తప్పదన్నాడు. మొత్తానికి జయలలిత కు భారతరత్న విషయంలో డిమాండూ తమిళనాడు నుంచే, నిరసనా తమిళనాడు నుంచే వినిపిస్తోంది.  Readmore!

Show comments

Related Stories :