పోతే పోనీ.. మనకేంటీ.?

మంత్రి పదవి దక్కకపోవడంతో అలకపాన్పు ఎక్కిన నేతలు ఒకరొకరుగా దారికొస్తున్నారు. ఇంకొందరు ఇంకా గుస్సా అవుతూనే వున్నారు. 'మమ్మల్ని మోసం చేస్తారా.? అవమానిస్తారా.?' అంటూ ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న నేతల విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లే కన్పిస్తోంది. దారికొచ్చేందుకు సిద్ధమవుతున్న నేతల్ని మాత్రం తనదైన 'స్టయిల్లో' బుజ్జగించేస్తున్నారు చంద్రబాబు. 

'వచ్చేవాళ్ళను బుజ్జగిస్తాం.. రాకుంటే అంతే సంగతులు..' అంటూ ఇప్పటికే సంకేతాలు పంపిన చంద్రబాబు, ఈ బెదిరింపుల పర్వంలో కొంత మేర విజయం సాధించారనే చెప్పాలి. జ్యోతుల నెహ్రూ సరిపెట్టుకున్నారు, ధూళిపాళ్ళ నరేంద్ర నిన్ననే రాజీకొచ్చారు.. కంటతడిపెట్టుకున్న శివాజీ సర్దుకుపోయారు.. వీళ్ళందరి విషయంలో చంద్రబాబు స్ట్రాటజీ పక్కాగా వర్కవుట్‌ అయ్యింది. కానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తదితరులు మాత్రం దిగొచ్చేది లేదంటున్నారు. 

ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన ఓవరాక్షన్ కారణంగా అధినేత ఆగ్రహాన్ని ఎప్పుడో చవిచూసేశారు.. పైగా నియోజకవర్గంలోనూ అయ్యగారి వెలుగులు తగ్గిపోతున్నాయని చంద్రబాబు గ్రహించేశారట. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంత్రిగానే తన ఉనికిని కాపాడుకోలేకపోయారన్న విమర్శలున్నాయి. ఈ లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు, 'దారికొస్తే వచ్చినట్లు, లేదంటే అలాంటోళ్ళతో పార్టీకి ఉపయోగమేమీ లేదు కనుక, వదిలెయ్యండి..' అనేస్తున్నారట. 

'రోజులు గడిచేకొద్దీ అన్నీ సర్దుకుంటాయ్‌..' అని టీడీపీ నేతలు చెబుతున్నా, అతి త్వరలో ఒకరిద్దరు అసంతృప్తులు టీడీపీకి గుడ్‌ బై చెప్పే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధినేత చంద్రబాబు పట్టించుకోకపోవడం, చివరికి నారా లోకేష్‌ కూడా పట్టించుకోకపోవడంతో పార్టీని వీడటం తప్ప తమకు వేరే దారి లేదన్నది సదరు అసంతృప్తుల వాదన. ఇందులో గోరంట్ల, బొజ్జల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. అధినేత చంద్రబాబు తమను కరివేపాకులా వాడుకుని వదిలేశారని వాపోతున్నారు వీరంతా. Readmore!

Show comments