రోశయ్య...మళ్లీ మరో టెర్మ్?

అజాత శతృవు, నొప్పివ్వక, తానొవ్వక తప్పించుకు తిరిగే విద్యలో ఆరితేరిన రాజకీయ కురువృద్ధుడు, కొణిజేటి రోశయ్యకు మరో దఫా పదవీకాలం పొడిగించేందుకే కేంద్రం నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చేనాటికే రోశయ్య గవర్నర్ గా వున్నారు. మోడీ మార్చకుండా వదిలేసిన ఒకరిద్దరు గవర్నర్లలో రోశయ్య ఒకరు. దీనికి తగినట్లే రోశయ్య కూడా అణుమాత్రం వివాదాలకు, అక్కర్లేని ప్రకటనలకు తావివ్వకుండా తన పదవీకాలం పూర్తి చేసారు.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్వయంగా మోడీకి లేఖ రాసి రోశయ్య పదవీకాలాన్ని పొడిగించమని కోరారు. ఇప్పుడు దీనికి అదనంగా పలువురు కేంద్రమంత్రులు కూడా మోడీకి అదే విన్నవించినట్లు తెలుస్తోంది.  దీంతో తమిళనాడుకు కొత్తగా మరెవరినీ గవర్నర్ గా నియమించరని, రోశయ్యనే  కంటిన్యూ చేస్తారని తెలుస్తోంది. కేవలం మంత్రులే కాకుండా, రాజకీయేతర ప్రముఖులు కొందరు కూడా మోడీకి రోశయ్యపై మంచి రిపోర్టు ఇచ్చి, కొనసాగించమని కొరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి తన పదవీ కాలం దాదాపు ముగిసినట్లే అని రోశయ్య తన సన్నిహితులకు ముందే హింట్ ఇచ్చారు. తనతో కార్యక్రమాలు ఏవయినా ప్లాన్ చేస్తే, ఆ లోపే ప్లాన్ చేసుకోమన్నారు. ఆ విధంగానే ఇటీవల కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు పొడిగింపు దాదాపు జరిగినట్లే అని తెలుస్తోంది కాబట్టి, రోశయ్య అభిమానులు, సన్నిహితులు ఫుల్ హ్యాపీ.

Show comments