తెలివిగా తప్పించుకున్న తమిళ హీరో

తమిళ హీరో అజిత్‌ చాలా తెలివిగా తప్పించుకున్నాడు. జయలలిత వారసుడెవరు.? అన్న ప్రశ్నకు అజిత్‌ పేరు సమాధానంగా తెరపైకొచ్చిన విషయం విదితమే. పలు సందర్భాల్లో జయ తన సన్నిహితుల వద్ద తన రాజకీయ వారసుడు అజిత్‌ అని చెప్పారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అజిత్‌ ఏంటి, జయలలిత రాజకీయ వారసుడేంటి.? అని అంతా ఆశ్చర్యపోయారనుకోండి.. అది వేరే విషయం. 

ఎలాగైతేనేం, ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లో అజిత్‌ పేరు విన్పించడంలేదు. తనకింకా సినిమా లైఫ్‌ చాలా వుందనీ, ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చి సాధించేదేమీ లేదని భావించిన అజిత్‌, తెలివిగా ముందే జాగ్రత్తపడ్డాడట. అందుకే, జయలలిత ఆసుపత్రి పాలైన తర్వాత, ఏమాత్రం రాజకీయంగా తొందరపడలేదని తెలుస్తోంది. జయలలిత నుంచి స్వయంగా అజిత్‌కి పిలుపు అందినా, దాన్ని ఆయన లైట్‌ తీసుకున్నాడని తమిళ రాజకీయాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. 

మరోపక్క, జయలలిత మృతి చెందిన సమయానికి విదేశాల్లో వున్న అజిత్‌, ఆఘమేఘాల మీద చెన్నయ్‌కి వచ్చినా, అమ్మని కడసారి దర్శించుకునే అవకాశం కోల్పోయాడు. ఆ తర్వాత చిన్నమ్మని రహస్యంగా కలిసి, 'రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు..' అనే విషయమ్మీద క్లారిటీ ఇచ్చేశాడట. అలా అజిత్‌, పెద్ద పొలిటికల్‌ గండమే తప్పించుకున్నాడు. రాజకీయాల విషయంలో రజనీకాంత్‌ ఎలా వున్నారో, విజయ్‌కాంత్‌ ఏమయ్యారో అజిత్‌కి తెలియని విషయమా.? అందుకే, అందివచ్చిన అవకాశాన్ని కూడా అజిత్‌ కాదనుకున్నాడు. తెలివైనోడే మరి.!

Show comments