చంద్రబాబుని చూసి నేర్చుకోండయ్యా.!

రాజకీయాల్లో బుకాయించడం ఎలాగో చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి.. మాట మార్చడమెలాగో ఆయన్ని చూసే నేర్చుకోవాలి.. వెన్నుపోటు రాజకీయాల గురించి అయినా ఆయన వద్దే నేర్చుకోవాలి.. ఈ ఈ విభాగాల్లో చంద్రబాబు ఎప్పుడో మాస్టర్‌ డిగ్రీ చేసేశారు. అసలు, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధినేత ఎలా అయ్యారు.? ముఖ్యమంత్రి పదవి ఎలా దక్కింది.? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే చాలు, చంద్రబాబు అంటే ఏంటో ఇట్టే అర్థమయిపోతుంది. 

ఆంధ్రప్రదేశ్‌ మీద అభిమానంతో చంద్రబాబు, హైద్రాబాద్‌ నుంచి మకాం మార్చారని ఎవరైనా గుండె మీద చెయ్యేసుకుని చెప్పగలరా.? ఛాన్సే లేదు. ఓటుకు నోటు కేసు తెరపైకి రాకపోయి వుంటే, 'పదేళ్ళు హైద్రాబాద్‌ ఉమ్మడి రాజధాని.. ఆ హక్కుని వదులుకునే ప్రసక్తే లేదు..' అని చంద్రబాబు ఇప్పటికీ చెబుతుండేవారే. ఆ ఓటకు నోటు కేసు వెంబడించబట్టే చంద్రబాబు, హైద్రాబాద్‌ నుంచి విజయవాడకు పారిపోయారు. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. 

ప్రత్యేక హోదా విషయంలో, చంద్రబాబు - నరేంద్రమోడీ సర్కార్‌ని ఎందుకు ప్రశ్నించడంలేదు.? అని చిన్న పిల్లాడినడిగినా సమాధానం చెబుతాడు.. నరేంద్రమోడీ ముందు చంద్రబాబు సాగిలాపడ్డారనీ, అందుకే మోడీని ప్రశ్నించడంలేదని. 'వైఎస్‌ కేసులు పెట్టారు.. సోనియా బెదిరించారు.. అయినా బెదరలేదు..' అని చంద్రబాబు బుకాయిస్తుండడం ఇప్పుడు కొత్తగా చూస్తున్న వ్యవహారమేమీ కాదు. 

'మీ దిక్కున్న చోట చెప్పుకోండి..' అంటూ కేంద్రం ఒకటికి పదిసార్లు ఆంధ్రప్రదేశ్‌కి తేల్చి చెప్పింది చాలా విషయాల్లో. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, రైల్వే జోన్‌.. వాట్‌ నాట్‌.. అన్ని విషయాల్లోనూ ఒకటే సమాధానం. 'మాకు ఇబ్బందులున్నాయ్‌.. మేం చెయ్యలేం..' అని. ఇంత జరుగుతున్నా, కేంద్రంతో సత్సంబంధాలు అవసరమని చంద్రబాబు చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? 

మామూలుగా అయితే, 'ఛత్‌.. నీతో నాకు దోస్తీ అనవసరం..' అని మోడీతో చంద్రబాబు తెగతెంపులు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకోవడం కేంద్రం బాధ్యత. ఎందుకంటే, దేశంలోని 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒకటి. బీజేపీతో, టీడీపీ తెగతెంపులు చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్‌ని కేంద్రం పట్టించుకోదు.. అనడం ఒట్టి భూటకం. కేంద్రం పట్టించుకోకపోతే, ఆ లెక్క ఇంకోలా వుంటుంది. రాష్ట్రం స్తంభించిపోతే, కేంద్రం దిగిరాకుండా వుంటుందా.? 

నిస్సిగ్గుగా చంద్రబాబు చెబుతున్నారు.. 'కేంద్రంతో లాలూచీ పడలేదు' అని. నమ్మేవారెవరన్నా వున్నారా.. ఛాన్సే లేదు. ఆ లాలూచీలేంటో అందరికీ తెలుసు. అందులో ముఖ్యమైనది ఓటుకు నోటు కేసు అయితే, రెండోది రాజకీయంగా తన ఎదుగుదల, తన కొడుకు రాజకీయ భవిష్యత్తు. ఇదీ, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల్ని కేంద్రం వద్ద తాకట్టు పెడుతున్న తీరు. ఆంధ్రప్రదేశ్‌ని ఉద్ధరించేస్తాడని చంద్రబాబుని గద్దెనెక్కిస్తే.. ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు భలే గుణపాఠమే చెప్తున్నారు. నేర్చుకోవాలి.. చంద్రబాబు నుంచి నేర్చుకోవాలి.. రాజకీయమంటే ప్రజల్ని వంచించడమేననుకునేవాళ్ళెవరైనాసరే, చంద్రబాబు నుంచి చాలా చాలా నేర్చుకోవాలి.

Show comments