కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతోంది....!

'కడుపు చించుకుంటే కాళ్ల మీద పడటం' ఏమిటి? ఎవరు చించుకుంటున్నారు? ఎవరి కాళ్ల మీద పడుతోంది? కడుపు చించుకుంటే కాళ్ల మీద పడటమంటే మనసులోని బాధను, ఆవేదనను బయటకు చెప్పుకోవడం. కొందరు ఏదో విషయాల గురించి అదే పనిగా బాధపడుతుంటారు. ఆ సమయంలో ఎవరైనా వెళ్లి ఏంటలా ఉన్నారని ప్రశ్నించారనుకోండి 'కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందండీ' అంటారు.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నాయకుల పరిస్థితి ఇలాగే ఉందట....!

కొందరు మంత్రులు, నాయకులు తండ్రీకొడుకులపై అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. తండ్రీకొడుకులంటే ఎవరు? టీడీపీ అధినేత కమ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్‌ బాబు కుమారుడు లోకేష్‌. వీరి ప్రవర్తన, వ్యవహారశైలి కొందరికి బాధాకరంగా ఉన్నా బహిరంగంగా చెప్పుకోలేరు కదా. కక్కలేక మింగలేక అల్లాడిపోవాల్సిందే. చెప్పుకోవడానికి వారికి ఉన్న ఒకే మార్గం మీడియా.

ఆఫ్‌ ది రికార్డుగా నాయకులు, మంత్రులు ఓ ఆంగ్ల పత్రికతో తమ బాధను పంచుకున్నారు. తండ్రీకొడకుల ప్రవర్తన పార్టీపై 'ప్రభావం' చూపుతుందని కూడా ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభావమంటే నెగెటివ్‌ ప్రభావమనే అర్థం. ముందుగా కొడుకు దగ్గరకు వస్తే...'పచ్చ' పార్టీలోని మెజారిటీ నాయకులు, పలువురు మంత్రులు తమ అంతర్గత సంభాషణల్లో లోకేష్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్‌ నాయకులను ట్రీట్‌ చేస్తున్న విధానం సరిగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈమధ్య ఓ సీనియర్‌ మంత్రి గుంటూరులోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లినప్పుడు లోకేష్‌ ఆయన  రెండు గంటలపాటు వెయిట్‌ చేయించాడట...! దీంతో ఆ మంత్రి తన బాధను సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారు. ఇదొక ఉదాహరణ మాత్రమే. లోకేష్‌ సీనియర్లపట్ల సరిగా వ్యవహరించడంలేదనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే అతనిపై చంద్రబాబుతో ఫిర్యాదు చేసేందుకు ఎవ్వరికీ ధైర్యం చాలడంలేదు. టీడీపీలో చాలామంది నాయకులు ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పటినుంచి ఉన్నారు. చంద్రబాబు సమకాలికులున్నారు. వీరి ముందు లోకేష్‌ వయసులోనూ, అనుభవంలోనూ చాలా చిన్నవాడు. అయితేనేం అథారిటీ చెలాయిస్తున్నాడు.

మంత్రిని వెయిట్‌ చేయించిన ఘటనపై ఓ బీసీ నాయకుడు మాట్లాడుతూ సీనియర్లతో వ్యవహరించే, గౌరవించే విషయంలో వైఎస్‌ జగన్‌కు, లోకేష్‌కు ఏమీ తేడా లేదని అన్నాడు. వైకాపాలోని సీనియర్‌ నాయకులు జగన్‌పై కూడా ఇటువంటి ఆరోపణలే చేస్తున్నట్లు చెప్పాడు. వైకాపా నుంచి బయటకొచ్చిన నాయకుల్లో కొందరు జగన్‌పై మర్యాదకు సంబంధించిన ఆరోపణలు చేయడం తెలిసిందే.

టీడీపీలో 1982 నుంచి ఉంటున్న సీనియర్‌ నాయకులు కూడా లోకేష్‌ కూడా జగన్‌లా వ్యవహరిస్తున్నాడని అన్నారట...! కాని చంద్రబాబు దగ్గర ఇందుకు భిన్నంగా ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటున్నాడని, చక్కగా వ్యవహరిస్తున్నాడని చెబుతున్నారు. నాయకులు తమ అంతర్గత సంభాషణల్లో లోకేష్‌ ప్రవర్తనను చంద్రబాబు ప్రవర్తనతో (టీడీపీలో చేరిన కొత్తల్లో) పోల్చి చూస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారిని కూడా పేర్లు గుర్తుంచుకొని అభిమానంగా పలకరించేవారని, కలివిడిగా ఉండేవారని గుర్తు చేసుకుంటున్నారు. సీనియర్లను గంటల తరబడి ఎదురుచూసేలా చేయడం చంద్రబాబు వ్యవహారశైలి కాదంటున్నారు.

ఇక బాబు విషయానికొస్తే....తాజాగా ఆయన కేబినెట్‌ సమావేశాలకు మంత్రులు సెల్‌ఫోన్‌లు తీసుకురాకూడదని ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశానికి వెళ్లిన మంత్రులంతా తమ మొబైల్‌ ఫోన్లను బయట సెక్యూరిటీలో ఇచ్చి లోపలికి వెళ్లారు. సెక్యూరిటీ కారణాలతో సెల్‌ ఫోన్లు తేవడంపై నిషేధం విధించినట్లు చెబుతున్నారు.

విజయవాడ క్యాంపు కార్యాలయంలోనూ బాబు ఇదే విధానం పాటించారు. సెల్‌ఫోన్లపై నిషేధాన్ని మంత్రులు అవమానకరంగా భావిస్తున్నారు. ''ఇది చాలా అవమానకరంగా ఉంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి నిషేధం లేదు. బాబుకు మంత్రులపై నమ్మకం లేకపోవడం దురదృష్టం'' అని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. దీని ప్రభావం పార్టీపై ఉంటుందన్నారు. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రితో తాము మాట్లాడే పరిస్థితి లేదని, తమ ఆలోచనలు పంచుకోలేమని అశక్తత వ్యక్తం చేశారు.

నిషేధంపై మరో మంత్రి మాట్లాడుతూ ఇది సెక్యూరిటీకి సంబంధించిన విషయం కానేకాదన్నారు. ఈ చర్య మంత్రులకు అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీమానిటైజేషన్‌ ప్రకటన చేసే రోజు ప్రధాని మోదీ ఇదే విధంగా సెల్‌ఫోన్లపై నిషేధం విధించారని గుర్తు చేశారు. మొబైల్‌ ఫోన్ల నిషేధం ఒక్క కేబినెట్‌ సమావేశాలకే కాదు, మంత్రులు సీఎం ఛాంబరులోకి వెళ్లేటప్పుడు కూడా ఫోన్లు తీసుకెళ్లకూడదు. ఈ నిషేధం ఏ పరిణామాలకు దారి తీస్తుందో...!

Show comments