నరేంద్ర మోడీ, కేజ్రీవాల్‌.. గెలిచిందెవరు.!

ఇటువైపునుంచి నరేంద్రమోడీ.. అటువైపు నుంచి కేజ్రీవాల్‌.. మధ్యలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌.. ఈ పొలిటికల్‌ ఫుట్‌ బాల్‌ గేమ్‌లో మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నది ఎవరు.? అంటే, సమాధానం సింపుల్‌. అటు కేంద్రానికీ, ఇటు రాష్ట్రానికీ మధ్య లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవిలో నజీబ్‌ జంగ్‌ నలిగిపోయారు. 2013లోనే ఢిల్లీకి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అయిన నజీబ్‌ జంగ్‌తో కాంగ్రెస్‌ పార్టీ కూడా బాగానే ఆడేసుకుందనుకోండి.. అది వేరే విషయం. అయినాసరే బీజేపీ - ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్య నజీబ్‌ జంగ్‌ ఇంకా ఎక్కువగానే నలిగిపోయారు. ఫలితం, ఈ రాజకీయ పోరాటంలో అలసిపోయి, నజీబ్‌ జంగ్‌ తన పదవికి రాజీనామా చేసెయ్యాల్సి వచ్చింది. 

'ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేయడం కన్నా, పాఠాలు చెప్పుకోవడం చాలా చాలా చాలా బెటర్‌..' అనే నిర్ణయానికి వచ్చేశారు నజీబ్‌ జంగ్‌. ఐఏఎస్‌ అధికారిగా పనిచేసిన నజీబ్‌ జంగ్‌, తన జీవితంలో ఇంతటి 'నైరాశ్య' పరిస్థితుల్ని ఎప్పుడూ ఎదుర్కొని వుండరేమో.! ఢిల్లీ సాదా సీదా రాష్ట్రం కాదు. అది కేంద్రపాలిత రాష్ట్రం. ఓ సాధారణ రాష్ట్రానికీ, కేంద్ర పాలిత రాష్ట్రానికీ వుండే తేడాలు, ఉన్నత విద్యనభ్యసించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కి తెలియవని ఎలా అనుకోగలం.? అయినాసరే, ఆయన కూడా లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో ఓ ఆట ఆడుకున్నారు. 

ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాల్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ హోదాలో సమీక్షించడం నజీబ్‌ జంగ్‌ బాధ్యత. ఆయన తన పని తాను చేసుకుపోయారు. కానీ, కేజ్రీవాల్‌ నజీబ్‌ జంగ్‌ని తప్పుపట్టేవారు. పోనీ, కేజ్రీవాల్‌ పనుల పట్ల చూసీ చూడనట్లు వదిలేద్దామా.? అంటే, 'లెఫ్టినెంగ్‌ గవర్నర్‌గా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించలేరా.? మీరేమన్నా అసమర్థులా.?' అన్న ప్రశ్నలు కేంద్రం నుంచి దూసుకొస్తాయి. వెరసి, నజీబ్‌ జంగ్‌ పాట్లు అన్నీ ఇన్నీ కావు. 

లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నజీబ్‌ జంగ్‌ రాజీనామా వ్యవహారంపై బీజేపీ ఆచి తూచి స్పందిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా అంతే. గతంలో విభేదాల్ని పక్కన పెట్టి, ఆయన్ని పరామర్శించి వచ్చారు కేజ్రీవాల్‌. చాలాసేపు వీరిద్దరి మధ్యా ఈ రోజు చర్చలు జరిగాయి. అనంతరం మీడియా ముందుకొచ్చిన కేజ్రీవాల్‌, 'వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారు..' అంటూ సెలవిచ్చారు. తప్పదు మరి, తన వేధింపులతోనే ఆయన రాజీనామా చేశారని కేజ్రీవాల్‌ చెప్పగలరా.? కేజ్రీవాల్‌ మాత్రమే కాదు, నరేంద్రమోడీ కూడా ఆ మాట చెప్పలేరు. 

కానీ, వాస్తవం అందరికీ తెలుసు. ఇక్కడ కేజ్రీవాల్‌ విజయం సాధించారు.. నజీబ్‌ జంగ్‌ రాజీనామా చేసేంతలా ఆయనపై ఒత్తిడి తెచ్చారు మరి. అదే సమయంలో నరేంద్రమోడీ కూడా గెలిచారు, నజీబ్‌ జంగ్‌ని ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టారు గనుక. ఈ పాపంలో కాస్తో కూస్తో వాటా కాంగ్రెస్‌ పార్టీకి కూడా వుందండోయ్‌.!

Show comments