హీరో గారు పార్టీని రద్దు చేయనున్నారా..?

తమిళనాడు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బకు కాదు కానీ.. ఆ తర్వాతి పరిణామాలే విజయ్ కాంత్ ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయని తెలుస్తోంది. ఈ నిస్పృహలో ఆయన  పార్టీని రద్దు చేయాలనే అభిప్రాయానికి కూడా వచ్చినట్టు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి కనీసం రెండో స్థానాన్ని కూడా పొందలేకపోయిన విజయ్ కాంత్ రాజకీయాల నుంచి విరామం తీసుకొంటున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అయితే ఒక్కసారి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాకా.. విరామాలు, విశ్రాంతిలు అంటే కష్టం. రాజకీయాలేమీ సినిమా కాదు కదా. అందుకే.. ఈ విరామ ప్రకటనపై సొంత పార్టీలోని వారి నుంచే విజయ్ కాంత్ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో వీటన్నింటికీ పుల్ స్టాప్ పెట్టడానికి తన పార్టీ రద్దు ప్రకటనను చేసే ఆలోచన చేస్తున్నాడట ఈ  నల్ల ఎంజీఆర్. ఇదే సమయంలో చిరంజీవిలా తన పార్టీని మరో పార్టీలోకి విలీనం చేసే ఆలోచన కూడా ఉందట విజయ్ కాంత్ వద్ద. 

బీజేపీ గనుక ఓకే అంటే.. విజయ్ కాంత్ ఆ పార్టీలోకి తన పార్టీ ని విలీనం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే మొన్నటి ఎన్నికల తర్వాత విజయ్ కాంత్ రేంజ్ చాలా వరకూ తగ్గిపోయింది. అసెంబ్లీల ప్రధాన ప్రతిపక్ష నేత స్థాయి నుంచి కనీసం ఎమ్మెల్యేగా రెండో స్థానాన్ని సంపాదించలేని స్థాయికి దిగజారింది ఈ స్టార్ హీరో పరిస్థితి. 

ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అయినా విజయ్ కాంత్ విలీన ప్రతిపాదనను అంతగా గౌరవిస్తుందని అనుకోవడానికి లేదు. దీంతో విజయ్ కాంత్ పార్టీ రద్దు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీని రద్దు చేసి రాజకీయాలకు దూరంగా జరిగి.. తిరిగి సినిమాల్లో బిజీ అయిపోయే ఆలోచనలో ఉన్నాడు ఈహీరోగారు. 

Show comments