ఏ విషయంలోనైనా 'మెలికలు' పెట్టడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుంటుంది. రాజకీయాలైనా, కళలైనా మెలికలు పెట్టడమే ప్రధానం. అలా మెలిక పెట్టకపోతే తెలంగాణ ముద్ర, ప్రత్యేకత కనబడవు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. మెలికలు పెట్టడం ఏ రాష్ట్రం విషయంలో జరుగుతుంది? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఆంధ్రప్రదేశ్ విషయంలోనే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఏమిటది? ఉత్తమ తెలుగు చలనచిత్రాలకు అవార్డులు ఇవ్వాలని. ఉమ్మడి రాష్ట్రంలో 'నంది' అవార్డులు ప్రదానం చేయడం తెలిసిందే కదా.
విభజన తరువాత ఆ అవార్డులు ఆంధ్రప్రదేశ్‌కు పరిమితమయ్యాయి. తెలంగాణ సర్కారు 'సింహా' పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణలో తిరుమల స్థాయి పుణ్యక్షేత్రమైన యాదాద్రి నరసింహస్వామి పేరిట ఈ అవార్డులు ఇవ్వబోతున్నారు. మరీ నరసింహస్వామి అనే పేరుతో ఇస్తే బాగుండదు. అందుకే దాన్ని కుదించి 'సింహా' అని పేరు పెట్టారు. నంది అంటే లేపాక్షికి చిహ్నం. సింహా అంటే యాదాద్రికి చిహ్నం. మొత్తం మీద అవార్డు పేరు గంభీరంగా, పౌరుషం ఉట్టిపడేలా ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే చిన్న మెలిక.
20 శాతం తెలంగాణలో చిత్రీకరించిన సినిమాలనే అవార్డులకు పరిశీలిస్తారు. తెలంగాణలో షూటింగ్ జరపని సినిమాల ఎంట్రీలను తిరస్కరిస్తారు. అలాంటివారు అసలు ఎంట్రీలు పంపకూడదు. ఎంత గొప్ప కథైనా ఇరవై శాతం తెలంగాణలో చిత్రీకరించి ఉండాల్సిందే. ఈ మెలిక మంచిదా? కాదా? అనేది తప్పకుండా చర్చనీయాంశమవుతుంది. కళారూపమైన సినిమాకు ఇలాంటి నిబంధనేంటి? అని ప్రశ్నించవచ్చు. ఎందుకంటే కథను బట్టి లొకేషన్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కథకు అనుగుణమైన లొకేషన్లు తెలంగాణలో లేకపోతే? అప్పుడు ఈ రాష్ట్రంలో తీసే వీలుండదు కదా.
సో...దాన్ని అవార్డు పరిశీలనకు పంపే అవకాశం లేదు. తెలంగాణలో 20 శాతం చిత్రీకరణ నిబంధన లేకుంటే పూర్తిగా ఆంధ్రాలో తీసిన సినిమాలు అవార్డులకు వస్తాయి. వాటికి అవార్డులిస్తే ఆంధ్రా సినిమాలకు అవార్డులిచ్చారనే ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలొస్తాయి. తెలంగాణలో తప్పనిసరిగా చిత్రీకరించాలనే నిబంధన ఉంటేనే సినిమాల్లో తెలంగాణలోని లొకేషన్లు కనబడతాయి. ఇక్కడి సినిమా కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. తెలంగాణ ఉద్యమం కారణంగా ఉమ్మడి ఆంధ్రాలో నంది అవార్డుల ప్రదానం నిలిచిపోయింది.
2014 నుంచి ఉభయ రాష్ట్రాల్లో అవార్డుల ప్రదానం జరగలేదు. తెలంగాణలో ఇప్పుడు సింహా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించడంతో కొత్త చరిత్ర మొదలైంది. నంది ఆంధ్రాకు పరిమితమైంది.2014 నుంచి 2016 వరకు నిర్మించిన సినిమాలకు వెంటనే అవార్డులు ఇవ్వాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. వీటిల్లో తెలంగాణలో తీయని సినిమాలుంటే వాటిని ఆంధ్రా అవార్డులకు పంపుకోవాల్సిందే. ఇక 'తెలంగాణలో 20 శాతం చిత్రీకరణ' అని కేసీఆర్ సర్కారు నిబంధన పెట్టిన విధంగా ఆంధ్రా సర్కారు పెడుతుందా? ఈ పని జరగకపోవచ్చు. ఎందుకంటే చిత్ర పరిశ్రమ పూర్తిగా హైదరాబాదులోనే ఉంది.
స్టూడియోలు, పలు రకాల రికార్డింగ్ థియేటర్లు అక్కడే ఉన్నాయి. హైదరాబాదులో చిత్రీకరణ జరపకుండా సినిమా తీయడం సాధ్యం కాదు. హైదరాబాదులో సినిమా తీస్తే అవార్డులు ఇవ్వమని ఆంధ్రా సర్కారు చెప్పేందుకు అవకాశం ఉండదు. చాలా సినిమాలు ఇరవై శాతం కంటే ఎక్కువగానే తెలంగాణలో ప్రధానంగా హైదరాబాదులో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ నగరాన్ని కాదని సాంఘిక చిత్రాలు నిర్మించడం సాధ్యం కాదు. పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా తీయాలన్నా తెలంగాణలో అందుకు అవకాశముంది. ఆంధ్రా ప్రభుత్వం కూడా నిబంధనలు పెడితే సినిమావాళ్లకు ఇబ్బందే.
ఇక తెలంగాణ సినిమా అభివృద్ధి చెందడంలేదంటూ 'నమస్తే తెలంగాణ'లో పలువురు వ్యాసాలు రాస్తున్నారు. రాష్ట్రం విడిపోయినా ఆంధ్రోళ్ల పెత్తనమే సాగుతోందని ఆవేదన చెందుతున్నారు. ఇలా ఆవేదన చెందుతున్నవారు కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని కూడా గమనించాలి. సినిమా పరిశ్రమను ఆంధ్రాకు పోనివ్వకూడదని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న, ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం తెస్తున్న సినీ పరిశ్రమ తరలిపోతే హైదరాబాద్ ఇమేజ్ సగం పడిపోతుంది.
అందుకే కేసీఆర్ ప్రభుత్వం సినిమా పరిశ్రమతో జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. ఈరోజు 'నమస్తే'లో ఒకాయన రాసిన వ్యాసంలో 'సినిమా నిర్మాణం కోసం ఖర్చు చేసే ధైర్యముంటే తెలంగాణ సినిమా అభివృద్ధి చెందేది'...అని పేర్కొన్నాడు. ఇది వాస్తవమే. నిజాం నవాబుల పాలనలో మగ్గిన తెలంగాణలో మొదట్నుంచీ సినీ పరిశ్రమ మీద మోజు చాలా తక్కువే.