చంద్రబాబుకు 'అమరావతి' భయం...!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి భయమా? రాజధాని నగరం అమరావతిని నిర్మించలేనని భయమా? అక్కడ జరుగుతున్నాయని చెబుతున్న అవినీతి, అక్రమాలు వగైరాల కారణంగా చెడ్డ పేరు వస్తుందని భయమా? వచ్చే ఎన్నికల నాటికి రాజధాని నగరాన్ని కొద్దిగానైనా నిర్మించకపోతే మళ్లీ అధికారంలోకి రాలేనని భయమా? ఏమిటి ఈయన భయం? రాజకీయ నాయకులకు ఏదో భయం ఉంటూనే ఉంటుంది. ప్రాణభయం ఉంటుంది. అధికారంలోకి రాలేకపోతామేమోననే భయం ఉంటుంది. అవినీతి కేసుల్లో ఇరుక్కుంటామనే భయం ఉంటుంది. చంద్రబాబు కూడా  ఈ భయాలకు అతీతం కాకపోవచ్చు. 

ఇక్కడ చెప్పుకుంటున్న భయం ఈ భయాల జాబితాలో లేదు. ఇది సెంటిమెంటుకు సంబంధించిన భయం. ప్రతి ఒక్కరికీ కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటికి హేతుబద్ధత ఉండదనే విషయం తెలిసిందే. సినిమా వాళ్లకు, రాజకీయ నాయకులకు మరీ ఎక్కువ సెంటిమెంట్లు ఉంటాయి. కొన్ని వారికి స్వతహాగా ఉంటే,  కొన్ని వాళ్లూ వీళ్లూ చెప్పిన మాటల వల్ల అంటుకుంటాయి. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మరీ ఇప్పుడున్నంత 'సెంటిమెంటల్‌ ఫూల్‌'లా లేరు. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయ్యాక సెంటిమెంట్లకు బానిసయ్యారు. ఇందుకు ప్రధాన కారణం భయాలే. ఇప్పుడు వాస్తుకు, ముహూర్తాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. 

రాష్ట్ర రాజధానికి 'అమరావతి' అనే చక్కటి పేరును పెట్టినందుకు చంద్రబాబును అందరూ అభినందించారు. ఆల్రెడీ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఉంది. ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రకంగా దానికో గొప్ప చరిత్ర ఉంది. విచిత్రమేమిటంటే...చంద్రబాబు తన జీవితంలో ఇప్పటివరకు అమరావతిలోని ఆలయంలోకి వెళ్లి అమరేశ్వరుడిని సందర్శించుకోలేదు. అంటే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పదేళ్లలో ఏనాడూ ఆ స్వామి దర్శనం చేసుకోలేదట...!  గత రెండేళ్లలోనూ ఏనాడూ అమరావతి ఆలయానికి పోలేదు. 

అంతగా ప్రాధాన్యం లేని ఆలయాలకూ వెళ్లిన చంద్రబాబు ప్రఖ్యాతి చెందిన అమరావతి ఆలయానికి ఎందుకు వెళ్లలేదు? దీని వెనక ఉన్న కారణం భయం. ఏమిటా భయం? ముఖ్యమంత్రి పదవి పోతుందని. విచిత్రంగా ఉంది కదా...! దేవుడిని దర్శంచుకుంటే పదవి పోతుందట..! ఈ విషయం ఈయనకు ఎవరు చెప్పారో తెలియదు. 1980లో కృష్ణా పుష్కరాలు జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పుష్కరాలకు వచ్చి అమరేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆ వెంటనే పదవి పోయిందట....! అప్పటినుంచి ఇదొక సెంటిమెంటుగా మారిందట...!  Readmore!

సరే...పదవిలో ఉండి అమరావతి ఆలయాన్ని సందర్శిస్తే పదవి పోతుందనే భయం ఉండొచ్చు. కాని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఎందుకు రాలేదో తెలియదు. అమరేశ్వరుడు కొలువదీరిన అమరావతిని కేంద్ర ప్రభుత్వం హెరిటేజ్‌ సిటీగా (వారసత్వ నగరం) ప్రకటించి నిధులిచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంయ్య నాయుడు, చంద్రబాబు అమరావతికి వెళ్లారు కాని బాబు ఆలయంలోకి వెళ్లలేదు. అమరావతిని బౌద్ధ మతం విల్లసిల్లిన ప్రాంతంగా బాబు ప్రచారం చేస్తున్నారే తప్ప శైవ మతానికి లేదా హిందూ మతానికి కేంద్రమనే విషయం విదేశాల్లో చెప్పడంలేదని కొందరు విమర్శిస్తున్నారు.

 చైనా, జపాన్‌లో బౌద్ధ మతం ఎక్కువ కాబట్టి 'మనం మనం బరంపురం' అన్నట్లుగా వారిని ఆకర్షించడానికి బౌద్ధ మతం సెంటిమెంటును ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు. ఒక సెంటిమెంట్‌ ఇప్పుడుందో లేదో తెలియదుగాని ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన నాయకుడు రాజకీయంగా అడ్రసు లేకుండా పోతాడని అనేవారు. ఈ శాఖ మంత్రిగా చేసిన నాయకుడి పదవి మధ్యలోనే ఊడుతుందట. తరువాత రాజకీయంగా ప్రాధాన్యం లేకుండా పోతుందట. అందుకే ఆ పదవి తీసుకోవడానికి ఎక్కువమంది ఇష్టపడకపోయేవారట. పదవులు రావడానికైనా, పోవడానికైనా రాజకీయ కారణాలుంటాయే తప్ప ఆలయాలకు వెళితే జరిగేవి కాదు. 

Show comments