టీవీబాంబ్‌పై పరిటాల వర్గం మరోమాట..!

టీవీ బాంబ్.. అనంతపురం ఫ్యాక్షన్ చరిత్రలో అత్యంత కిరాతకం. కొందరు అమాయకుల ప్రాణాలు తీసిన టీవీ బాంబ్ ఆ తర్వాత మరెంతో రక్తపాతానికి దారి తీసింది. మద్దెల చెరువు సూరీ ఇంటిలో పేలిన ఈ బాంబ్ అతడి కుటుంబాన్ని పూర్తిగా తుడిచి పెట్టడంతో పాటు.. సూరీలో ప్రతికారేచ్ఛను పెంచింది. అంతిమంగా పరిటాల రవి హతానికి దారి తీసింది కూడా టీవీ బాంబే అని వేరే చెప్పనక్కర్లేదు. అంతవరకూ ఫ్యాక్షన్‌తో పెద్దగా సంబంధం లేకుండా తన పనేదో తను చేసుకొంటున్న సూరిని ఈ రక్తపాతంలోకి దించింది టీవీ బాంబే. తండ్రి నారాయణ రెడ్డి హత్యకు గురి అయినా సూరి అప్పటికింకా ఫ్యాక్షన్‌కు దూరంగానే ఉన్నాడు. అయితే తమ ప్రత్యర్థి వర్గాన్ని మొగ్గలోనే తుంచేయాలన్న భావనతో రూపొందించినదే టీవీ బాంబ్. 

అంతా ఉత్సాహంగా విజయదశమి పండగ జరుపుకొంటున్న రోజున సూరి ఇంట్లో చీకటి మిగిలింది. ప్రత్యర్థులు తెలివిగా పన్నిన పన్నాగం.. ఇంట్లో టీవీ చెడిపోయి ఉండటంతో సూరి కుటుంబం దాన్ని బాగు చేయించడానికి టౌన్‌కు పంపింది. ఆ టీవీ మెకానిక్ షాపుకు చేరిన సందరా్భన్ని అనుకూలంగా మలుచుకుని.. దాని స్థానంలో సూరి ఇంటికి బాంబ్‌తో కూడిన టీవీని చేర్చడంలో ప్రత్యర్థులు విజయవంతం అయ్యారు. ‘‘మీ టీవీ రిపేర్‌కు సమయం పడుతుంది.. అంతవరకూ చూడటానికి టీవీనీ పంపిస్తున్నాం’’ అంటూ బాంబ్ అమర్చిన టీవీని సూరి ఇంటికి చేర్చారు. 

పండగ రోజున ఉదయాన్నే ఆ టీవీ ఇంట్లోకి రావడం.. ఇంట్లోవాళ్లు అమాయకంగా టీవీని ఆన్ చేయడం.. ఇళ్లు మొత్తం నేలమట్టం అయ్యేంత స్థాయిలో విస్పోటనం సంభవించడం.. ఈ సంఘటనలో సూర్యనారాయణ రెడ్డి తల్లి, తమ్ముడు, చెల్లెలుతో సహా వాళ్లింట్లో ఉండిన ఇతర అభాగ్యులు కూడా బలయ్యారు. టీవీ ఇంట్లో చేరడానికి కొన్ని నిమిషాల ముందు పక్కనే ఉన్న పిన్ని వాళ్లింటికి వెళ్లడంతో సూరి ప్రాణాలతో బయటపడ్డాడు. ఎంతో పక్కాగా ప్లాన్ చేసినా ప్రత్యర్థుల పాపం పండింది అక్కడే. ఆ ఘటనతో తన వాళ్లందరినీ పోగొట్టుకున్న సూర్య నారాయణ రెడ్డి తదనంతర కాలంలో సదరు ప్రత్యర్థులను మత్యువై వెంటాడాడు. మరి ఇలాంటి టీవీ బాంబ్ గురించి పరిటాల వర్గంను ఆరా తీస్తే.. ఈ విషయం గురించి చాలా చిత్రమైన కబుర్లే వినిపిస్తాయి.

బతికున్న రోజుల్లో.. తనకు ప్రాణభయం ఉందని.. తనను చంపేస్తారని.. టీవీలకు ఎక్కిన పరిటాల రవిని టీవీ బాంబు గురించి అడిగితే.. అసలు టీవీ బాంబే లేదని ఆయన అన్నాడు. సూరి వాళ్లింట్లో బాంబులుండిన్నాయి.. అవి పేలాయి, వాళ్లంతా పోయారు.. అంటూ రవి చెప్పుకొచ్చేవాడు. అన్ని విషయాల గురించి తెలిసిన రవి తన ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోయాడు. తాజాగా రాజకీయంగా ఎదిగొచ్చిన రవి అనుచరుడొకరు మాట్లాడుతూ.. టీవీ బాంబు నక్సలైట్ల పని అని చెప్పుకొచ్చాడు. రవికి ప్రధాన అనుచరుడు అయిన ఇతడు.. నారాయణ రెడ్డి కుటుంబంపై నక్సలైట్లకు కోపం అని.. వారే టీవీ బాంబును అమర్చారని ఇతడు అంటాడు. మరి టీవీ బాంబే లేదని రవి, కాదు ఆ బాంబును  నక్సలైట్లు పెట్టారని రవి అనుచరుడు చెప్పుకురావడం విచిత్రమైన అంశమే! నాయకుడి మాటకు, ప్రధాన అనుచరుడి మాటకు ఇంత వైరుధ్యమా! 

అలాగే చివరి దశలో రవి ప్రాణభయం గురించి కూడా ఈ అనుచరుడు కూలంకషంగా చెప్పుకొచ్చాడు. కాంగ్రెస్ పార్టీ గెలవగానే తమను జిల్లా దాటించి పంపేశాడని.. తను మాత్రం ఎక్కడకూ పోలేదని.. జిల్లాలోనే ఉన్నాడని.. ఇది రవి వీరత్వానికి నిదర్శనం అని ఈ అనుచరుడు చెప్పుకొచ్చాడు.

మరి అవతల పార్టీ అధికారంలోకి రాగానే జిల్లాలు దాటి పారి పోవాలనే దశకు వచ్చారంటే.. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఏ స్థాయిలో ఉండినాయో వీళ్లే చెప్పుకొన్నట్టు అవుతోంది. అలాగే.. రవి పారిపోలేదు, అందుకే ఆయన హీరో అంటున్నారు. మరి ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా చేసిన వ్యక్తి, పది సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉండిన వ్యక్తి.. ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి రాగానే పారిపోవాల్సిందా? అంత ప్రాణభయం పెంచుకునే పనులే చేశారా అధికారంలో ఉన్న ఆ పదేళ్లూ? ఒకవైపు తాము శాంతికాముకులం అని చెప్పుకుంటూనే మరోవైపు, పారిపోవడం గురించి మాట్లాడటం ఏమిటో! 

Show comments