అసలే వెంకయ్య... ఆపై చేతికి డప్పు...!

వెంకయ్యనాయుడు ప్రతిభా పాటవాలను ప్రధాని నరేంద్రమోడీ గుర్తించినట్లుగా గతంలో ఆయన సేవలను అందుకున్న నాయకులు ఎవ్వరూ గుర్తించలేదేమో అని అనిపిస్తోంది ఇప్పుడు. నరేంద్రమోడీ ఎంచక్కా వెంకయ్యనాయుడుకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ను అప్పగించారు. ఆ శాఖ పేరుకు 'ప్రచార' అనే పదాన్ని కూడా తగిలించగల నేర్పు ముప్పవరపు వెంకయ్యనాయుడుకు మాత్రమే ఉన్నదని నరేంద్రమోడీ చాలా చక్కగా గుర్తించారన్నమాట. అసలే.. వెంకయ్య... ఇప్పుడు ఆయన చేతికి డప్పు దొరికింది. ఇక ఆయన సంగతి ప్రత్యేకంగా చెప్పాలా? 

భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పునాదుల మీద పుట్టిన పార్టీగా చెప్పుకుంటుంది. కానీ వారు సాధారణంగా కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే ఫ్యూడల్‌, వ్యక్తిపూజ సంస్కృతి ఇప్పుడు ఆ పార్టీలో కూడా విచ్చలవిడిగా ప్రబలిపోయింది. ఇదివరకు కూడా వాజపేయి వంటి వారిని పార్టీ నెత్తిన పెట్టుకున్నప్పటికీ.. వారు తమ పరిధిని గుర్తెరికి పార్టీకి విధేయంగానే ఉండేవారు. కానీ నరేంద్రమోడీ వచ్చిన తర్వాత.. భాజపాలో వ్యక్తిపూజ అనేది ఎంత బీభత్సంగా పెరిగిపోయిందో అందరికీ తెలుసు. 

మోడీ పార్టీని, ఆరెస్సెస్‌ను అన్నిటినీ తన చెప్పుకింద ఉంచుకుని నడిపిస్తున్నారని కూడా కొన్ని వాదనలు వినిపిస్తూ ఉంటాయి. మోడీ దయాదాక్షిణ్యాల మీద మాత్రమే పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యం దక్కడం అనేది కొత్త వ్యవస్థగా అక్కడ మారిపోయింది. పార్టీకోసం సర్వం త్యాగం చేసిన వారంతా పక్కకుపోయి, మోడీ కనుసన్నల్లో మెలగే వారు మాత్రమే.. అగ్రపూజలందుకునే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో... కేంద్రంలో మంత్రులందరూ చాన్సు దొరికితే చాలు మోడీ భజనకు దిగడం, ఆయనను కీర్తించడం చాలా సందర్భాల్లో జరుగుతోంది. 

అలాంటి మోడీ భజనలో మన వెంకయ్యనాయుడు ది అందెవేసిన చేయి. ప్రజలను మెప్పించి, వారి ఓట్లతో గెలిచి నాయకుడిగా చెలామణీ కావడం అనే మాటను కొన్ని దశాబ్దాలుగా మరచిపోయిన వెంకయ్యనాయుడు .... కేవలం అగ్ర నేతల భజన మాత్రమే తన రాజకీయ జీవితానికి ఆయువుపట్టు అనే సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్నారు. ఇప్పుడు మోడీ హవా మొదలయ్యాక... ఆ సూత్రాన్ని మరింత ఘాటుగా ఆచరించారు. 

మోడీని భగవంతుడిగా అభివర్ణిస్తూ.. భగవంతుడు మన దేశానికి ఇచ్చిన వరంగా అభివర్ణిస్తూ.. ఆకాశం నుంచి దిగివచ్చిన అపర భగవత్‌స్వరూపంగా కీర్తిస్తూ... వెంకయ్యనాయుడు ఏ రేంజిలో మోడీ భజనకు తెగబడుతున్నాడో.. ఈరెండేళ్లలో ఆయన ప్రసంగాల్ని గమనిస్తున్న వారికి అర్థమవుతుంది. ఆయన ఏ సందర్భంలో, ఏ వేదిక మీద మాట్లాడినా సరే.. తన ప్రసంగంలో మోడీ భజనకు ఒక ప్రత్యేక భాగాన్ని కేటాయించుకుని ఉంటారంటే అది ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. 

ఇన్నాళ్లుగా అంత ఘనంగా కీర్తిస్తూ, భజన చేస్తూ ఉన్నందుకు ఇప్పుడు వెంకయ్యనాయుడుకు సరైన ఫలం దక్కింది. ఆయన మీద విపరీతమైన 'నమ్మకం'తో, మరింత ఘనమైన శాఖను నరేంద్రమోడీ ఆయన చేతుల్లో పెట్టారు. మోడీ భజనల్ని రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా మారుమోగించాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయనకే దక్కింది. ఆ విషయంలో అసలే వెంకయ్య.. ఆయన చేతికి ఇప్పుడు డప్పు అందించారు.. ఇక వేరే చెప్పాలా?

Show comments