అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నట్లే ఎన్నికల ప్రచారంలోనూ అనేక మార్పులను చూస్తున్నాం. గల్లీల్లో సైతం ఇంటింటికీ తిరగడమనే సంప్రదాయ ప్రచారం మొదలుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో భాగమైన సోషల్ మీడియాలో ప్రచారం వరకు పలు మార్పులొచ్చాయి. ప్రతి ఎన్నికల్లోనూ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక టెక్నాలజీని ఎంతగా ఉపయోగించుకున్నా గడప గడపకూ తిరగందే, ప్రజలతో మమేకం కానిదే పని జరగదు. అందుకే జిల్లా నాయకుకుల నుంచి జాతీయ నాయకుల వరకు రోడ్డున పడాల్సిందే. వాటినే మనం 'రోడ్ షో' అంటున్నాం. ఏ పార్టీ ప్రచారంలోనైనా రోడ్ షో కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రజలను నేరుగా కలుసుకునేందుకు, వారితో మమేకమయ్యేందుకు ఇదొక సాధనం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న ఉత్తరప్రదేశ్‌లో అందరికంటే ముందుగా ప్రచారం ప్రారంభించిన కాంగ్రెసు పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. హస్తం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ ముహూర్తం చూసుకొని (చూడకపోవచ్చు కూడా) ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో ప్రచారం (రోడ్ షో) ప్రారంభించారోగాని విఘ్నం కలిగింది. ఆమెకు హఠాత్తుగా అనారోగ్యం కలగడం, ఆ సందర్భంగా కిందపడి భుజానికి గాయం కావడంతో దానికి ఆపరేషన్ చేయడం తెలిసిందే. సోనియా రోడ్ షో మధ్యలోనే ఆగిపోవడం కాంగ్రెసు శ్రేణులకు నిరాశ కలిగించింది.
అధినేతకు ఏమీ కాకుండా ప్రచారం కొనసాగివుంటే కాంగ్రెసు కేడర్‌కు ఉత్సాహం కలగడమే కాకుండా ఇతర పార్టీలకూ తొందరపడాలనే ఆలోచన కలిగేది. ప్రచారం దీర్ఘకాలం ఆగిపోతే ఉత్సాహం సన్నగిల్లుతుందేమోనని యూపీ కాంగ్రెసు నాయకులు ఆందోళన పడుతున్నారట...! సాధ్యమైనంత త్వరగా సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ చేత ప్రచారం మొదలుపెట్టించాలనుకుంటున్నారు. సోనియా రోడ్ షో అర్ధంతరంగా ఆగిపోయింది కాబట్టి అదే రోడ్ షోతో ప్రియాంక ప్రచారం ప్రారంభిస్తారని కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు. ఆమె గోరఖ్‌పూర్ నుంచి సెప్టెంబరులో తొలి ప్రచారం (రోడ్ షో) ప్రారంభిస్తారని ఓ నాయకుడు చెప్పారు.
సోనియా గాంధీ రోడ్ షోకు అసాధారణమైన స్పందన వచ్చిందని, కాబట్టి ప్రియాంకతోనూ ఎక్కువ రోడ్ షోలు చేయించాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. రోడ్ షోలు పార్టీకి అనుకూల వాతావరణం కల్పిస్తాయని, ప్రాణవాయువులా ఉపయోగపడతాయని నాయకుల అభిప్రాయం. బహిరంగ సభల కంటే ఇవి ఎక్కువ మేలు చేస్తాయంటున్నారు. రోడ్ షోలు ప్రజల మూడ్‌ను, మైండ్‌సెట్‌ను మారుస్తాయని ఓ నాయకుడు అన్నారు. అలాగే పార్టీ నాయకత్వానికి కూడా గెలుపోటముల పట్ల ఓ అంచనాకు వచ్చేందుకు అవకాశముంటుందన్నారు. ఇదివరకు ప్రియాంక గాంధీతో విస్తృతంగా బహిరంగ సభలు నిర్వహించాలనకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 150 పైగా బహిరంగ సభలుంటాయని చెప్పారు. అయితే అన్ని సభలు అవసరమా? అని ఇప్పుడనుకుంటున్నారు. రాహుల్ గాంధీ కంటే ప్రియాంక మంచి ఉపన్యాసకురాలని, ఆమె చేత ఎక్కువ మాట్లాడించాలని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె మాటలు మంత్రం కావాలి. ఓటర్లను సమ్మోహితులను చేయాలి. బీజేపీ, ఇతర పార్టీల్లోని దిగ్గజ వక్తలను మట్టికరిపించేలా ఉపన్యాసాలు చేయాల్సివుంటుంది. కేవలం ప్రసంగాలు చేస్తే చాలదు. బాడీ లాంగ్వేజ్, హావభావాలు ప్రజలను ఆకట్టుకోవాలి. ఈ పెద్ద బాధ్యతను మోయడానికి ప్రియాంక సంసిద్ధమవుతుండొచ్చు.
పార్టీ ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితిలో ఆమె రాజకీయ సవాలును స్వీకరించక తప్పదు. గత ఎన్నికల్లో ప్రియాంక తల్లి, సోదరుడి నియోజకవర్గాలైన రాయబరేలి, అమేథీల్లో ప్రచారం చేశారు. అప్పట్లో ఆమె ప్రసంగాలపై ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనంలో ప్రియాంక స్టయిల్ (ఆహార్యం, భారతీయ వగైరా) బాగానే ఉందిగాని ప్రసంగాల్లో 'పస' లేదని వ్యాఖ్యానించింది. ఆమె ఎంతసేపటికీ వారి వంశం గురించి (తల్లిదండ్రులు, తాతయ్య, నాయనమ్మల గొప్పదనం, తన భర్త వాద్రాపై ఆరోపణలు మొదలైనవి) చెప్పుకున్నారే తప్ప ప్రభావవంతంగా ప్రసంగించలేదని పేర్కొంది. అంటే ఆమె ప్రజల సానుభూతి కోసం ప్రయత్నించారని అర్థం. ఇలాంటి ప్రసంగాలే ఈ ఎన్నికల ప్రచారంలో చేస్తే వర్కవుట్ కాకపోవచ్చు. ఈ విషయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆమెకు సూచనలు, సలహాలు ఇవ్వొచ్చు.