జగన్‌ ప్రశ్న: స్వాతంత్య్రం వచ్చిందా?

దేశానికి నిజంగానే స్వాతంత్య్రం వచ్చిందా.? అంటూ స్వాతంత్య్ర దినోత్సవ వేళ, పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాని ఆవిష్కరించిన అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఉద్వేగంగా ప్రసంగిస్తూ, ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్నీ, అవినీతి, అరాచక పాలననీ చూస్తోంటే స్వాతంత్య్రం వచ్చినట్లుగా లేదని తాను భావిస్తున్నానని జగన్‌ చెప్పుకొచ్చారు. 

మామూలుగా అయితే స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతుంటారు ఎవరైనా. అయితే, జగన్‌ కాస్త డిఫరెంట్‌గా ఆలోచించినట్లున్నారు. దళితులపై కొనసాగుతున్న వివక్ష గురించి వైఎస్‌ జగన్‌ ప్రస్తావించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో దళితులపై జరిగిన దాడి గురించి ప్రశ్నించిన జగన్‌, గుజరాత్‌లో దళితులపై జరిగిన దాడిని మాత్రం ప్రస్తావించే సాహసం చేయకపోవడం గమనార్హం. 

ఇక, స్వతంత్ర భారతావనిలో మనం రాసుకున్న రాజ్యాంగాన్ని మనమే అవమానపర్చుతున్న తీరు అత్యంత బాధాకరమని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నిజమే మరి, పార్టీ ఫిరాయింపుల విషయంలో రాజ్యాంగాన్ని మన పాలకులు వెక్కిరిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, టీఆర్‌ఎస్‌, టీడీపీ.. ఇలా తేడాలేమీ లేవు. చిత్రమైన విషయమేంటంటే తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ వైఎస్సార్సీపీ పార్టీ ఫిరాయింపు పరంగా బాధిత పార్టీ. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ బాధపెడుతున్న పార్టీ అయితే, తెలంగాణలో మాత్రం ఫిరాయింపుల కారణంగా బాధపడుతున్న పార్టీ టీడీపీ. 

మొత్తమ్మీద, స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ, రాజకీయ విమర్శలు ఒకింత అసందర్భంగా అనిపించినా, పార్టీ ఫిరాయింపులు, దళితులపై దాడులు.. వంటి విషయాల్ని ప్రస్తావిస్తూ సమాజంలో నేటి పరిస్థితుల్ని జగన్‌ ఎత్తిచూపడాన్ని ఎలా తప్పు పట్టగలం.?

Show comments