అసెంబ్లీ బలాలు శాశ్వతమా చంద్రన్న..?!

వెనుకటికి కూడా అధికారంలో ఉన్న వారు దోచుకోవడాలు.. జరిగాయి, అధికార దుర్వినియోగం చేసి సొంత ఆస్తులను, సొంత పార్టీ ఆస్తులను పెంచేసుకున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు, కానీ.. మరీ ఇంతలా నిర్భీతిగా, తెగింపు ధోరణితో ప్రతి వ్యవహారాన్నీ పెంటగా మార్చేసిన వాళ్లు మాత్రం బహుశా ఎవరూ లేరు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆధర్వ్యంలోని ప్రభుత్వం నుంచి వస్తున్న ఒక్కొక్కజీవో సగటు ప్రజానీకంలో విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ పరంపరలో.. తాజాగా అమరావతిలో పార్టీలకు భూముల కేటాయింపు వ్యవహారం కూడా ఒకటిగా నిలుస్తోంది. ఇందుకు సంబంధించి బాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో అక్రమంగా, హాస్యాస్పదంగా ఏ మాత్రం లాజిక్ కు అందనట్టుగా ఉంది.

అమరావతి కోసం సేకరించిన భూమికి ధర్మకర్తలా కాకుండా, నియంతలా, దాన్ని తన ప్రైవేటు ఆస్తిగా వ్యవహరించినట్టుగా, విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి. తాజాగా ఆయన ఆధ్వర్యంలోని కేబినెట్ భేటీలో రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపును చేశారు. ఈ విషయంలో బాబుగారి ధర్మం, విచక్షణ ఎలా ఉందో చూడండి. అసెంబ్లీలో బలాబలాలను బట్టి అమరావతిలో రాజకీయ పార్టీలకు భూమి కేటాయిస్తారట! ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాలను బట్టి ఈ కేటాయింపులు చేస్తారట!

ఈ లెక్కన తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి.. ఆ పార్టీకి 4 ఎకరాల భూమి ఇస్తారట, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అర ఎకరం భూమి వస్తుందట, భారతీయ జనతా పార్టీకి కొన్ని గజాల భూమి దక్కుతుంది. ఇక కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు.. తదితరాలన్నింటికీ సెంటు భూమి కూడా దక్కదు! 

మరి ఇదేం లెక్కో అర్థం కావడం లేదు. ముందుగా.. నూతన రాజధాని పరిధిలో రాజకీయ పార్టీలకు భూమి కేటాయించడం అవసరమా? అనేదాన్ని చంద్రబాబు ప్రభుత్వం పరిశీలించాలి. రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా సేకరించిన భూమిని ఇలా రాజకీయ పార్టీలు ఎలా పంచుకుంటాయి? అలా కాదు.. పార్టీలకు ప్రభుత్వం భూములు కేటాయించడం సహజనమే అనుకుందాం. మరి ఆ ఇచ్చేదానికి ఒక విచక్షణ పూర్వక లెక్క ఉండాలి కదా!

అసెంబ్లీ బలాబలాలను బట్టి భూములు కేటాయిస్తారా? అసెంబ్లీకి టర్మ్ పూర్తి అయితే? ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి, రేపటి ఎన్నికల్లో అసెంబ్లీలో బలాబలాలు మారవా? తెలుగుదేశం పార్టీకి ఇన్నే సీట్లు వస్తాయా? శాసనసభలో శాశ్వతంగా మూడు పార్టీలకే ప్రాతినిధ్యం ఉంటుందని చంద్రబాబుకు ఏమైనా కలొచ్చిందా?

ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉందని నాలుగు ఎకరాలు తీసుకుంటున్నారు కదా.. రేపు ఇదే పార్టీ ప్రతిపక్షంలోకి పోతే? మరో పార్టీ మెజారిటీని సాధిస్తే? అప్పుడు తెలుగుదేశం తన భూమిని వదులుకుంటుందా? రేపటి ప్రభుత్వం ఈ భూమిని వెనక్కు లాగేసుకుంటుందా? ఇప్పుడంటే కాంగ్రెస్ కు, కమ్యూనిస్టులకు సీట్లు లేవు కాబట్టి.. భూమి ఇవ్వమని అంటున్నారు. రేపు ఆ పార్టీలు ప్రాతినిధ్యం సంపాదిస్తే.. కొత్తగా భూమిని కేటాయిస్తారా? లేక తెలుగుదేశం ఆక్రమించేసిన భూమిలో వాటా ఇస్తారా? ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పదు! తెలుగుదేశం ఖాతాలోకి నాలుగెకరాలు భూమి తీసుకోవాలనుకున్నారు తీసుకున్నారు. మిగతా వ్యవహారాలన్నీ ప్రజల తలనొప్పి మాత్రమే. ప్రభుత్వానికి సంబంధం ఉండదు. 

మరి బాబు కేబినెట్ కు ఇలాంటి ఐడియాలో ఎలా వస్తాయో అర్థం కాదు. శాశ్వతం కాని బలాబలాల ఆధారంగా.. శాశ్వతమైన భూ కేటాయింపులు జరపడం అనేది అర్థం లేని పని. మరి ఇలాంటి వెర్రిమొర్రి జీవోలపై కోర్టులకు వెళ్లిన వారికి కూడా ఎలాంటి ప్రయోజనమూ దక్కిన దాఖలాలు ఇంత వరకూ లేవు! చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం విషయంలోనూ కోర్టులకు వెళ్లిన వారు సాధించింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలకు చేస్తున్న భూ కేటాయింపుల జీవో ఎంత వెర్రిగా ఉన్నా, అడ్డు చెప్పే నాథుడు ఎవరూ ఉండకపోవచ్చు!

Show comments