అన్నాడీఎంకే అభిమానులు ఆల్ మోస్ట్ ఫిక్స్ అయిపోయారు.. ఒకవేళ జయలలిత వీలైనంత త్వరగా ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి బయటకు రాకపోతే, ప్రభుత్వం కుప్పకూలుతుంది అని! జయ వారసులుగా సీఎం పీఠాన్ని అధిష్టించే వాళ్లెవ్వరూ ప్రభుత్వాన్ని పట్టు మని పది రోజులు నిలబెట్టుకోలేరు.. పార్టీలో అంతర్గత కలహాలు ప్రభుత్వాన్ని నిలబడనివ్వవు.. ఇది డీఎంకేకు అనుకూలంగా మరుతుంది లేదంటే మధ్యంతర ఎన్నికలు రావొచ్చు.. అనేది ఇప్పుడు జయలలిత అభిమానుల నుంచే వినిపిస్తున్న మాట!
జయలలిత ఇంకా కోలుకుంటున్నట్టుగా కనిపించడం లేదు.. వైద్యుల ప్రకటనలు ఏవైనా, ఆమె ఆరోగ్య స్థితి ని పరిగణనలోకి తీసుకుంటే.. ఇన్ని రోజుల పాటు ఆమె ఆసుపత్రికే పరిమితం కావడం, ఇప్పుడు విదేశాల నుంచి వైద్యులు వస్తున్నారని అనడం.. అనేక అనుమానాలకు తావిస్తోంది. అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది.
ఇప్పటి వరకూ జయకు ఏమీ కాలేదు.. అనే ప్రకటనే వస్తోంది. అయినప్పటికీ ఇప్పటికే అన్నాడీఎంకే లో అలజడి మొదలైందనేది బహిరంగ రహస్యం. సీఎం పీఠంపై కన్నేసిన వారి రాజకీయాలు ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు ఇక ఇన్ని రోజులూ జయ నియంతృత్వానికి తలవించిన వారూ ఇప్పుడు తల ఎగరేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
పార్టీ సుప్రీమోగా జయలలిత తీరు ఎలా ఉండిందో వేరే చెప్పనక్కర్లేదు. ఎవరైనా అది ఆమె ముందు సాష్టాంగ పడాల్సిందే! ఆమెకు కోపం వస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనాల్సిందే. ఇలాంటి వ్యవహారాలు రచ్చకు ఎక్కి జయ నియంతృత్వ ధోరణి చర్చనీయాంశం అవుతూ వచ్చింది.
అయితే.. అన్నాడీఎంకేలోని నేతలు మాత్రం జయకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనరు. అలా అన్న వాళ్లు పార్టీ నుంచి బహిష్కృతులవుతూ వచ్చారు. మరి అలా వెళ్లిపోయిన వారి సంగతెలా ఉన్నా, ఇన్నేళ్లూ అణిగిమణిగి ఉన్న వాళ్లే ఇప్పుడు పార్టీలో గుబులు రేపుతున్నారు. జయ చేతిలో అవమానాలు పొంది కూడా ఇన్నాళ్లూ తప్పని పరిస్థితుల్లో సర్దుకుపోయిన వాళ్లు ఇప్పుడు కచ్చితంగా రచ్చ చేస్తారని.. ఎలాగూ ప్రతిపక్ష పార్టీకి, అధికార పక్షానికి సీట్ల విషయంలో పెద్ద తేడా లేని నేపథ్యంలో.. వీరితో అన్నాడీఎంకే ప్రభుత్వానికి గండమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి వారిని గుర్తించి.. వారికి సర్ధి చెప్పే ప్రయత్నాలూ మొదలుపెట్టారట జయలలిత ఆంతరంగికులు!