ఓటుకు నోటు సినిమా చూపించరా.?

స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ మనోభావాలు దెబ్బతిన్నాయి.. ఆయన వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించాయనీ, ప్రతిపక్షం దురుద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు పట్టుకుని రాద్దాంతం చేసిందనీ ఆరోపిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో 'సినిమా' చూపించేశారు. మరి, అలాంటి సినిమానే.. ఇంకోటి కూడా చూపిస్తే బావుంటుంది కదా.! ఇది కేవలం ప్రతిపక్షం వైఎస్సార్సీపీ డిమాండ్‌ మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజానీకం నుంచి వస్తున్న డిమాండ్‌ కూడా. 

'మా ముఖ్యమంత్రి తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కోట్లు వెచ్చించి కుట్రపూరిత రాజకీయాలు చేశారనే ఆరోపణల్ని జీర్ణించుకోలేకపోతున్నాం.. అందులో వాస్తవమెంతో తేల్చండి..' అంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు పడ్తున్నాయి. అవును మరి, చంద్రబాబు బ్రీఫింగ్‌ వ్యవహారాన్ని అసెంబ్లీలో చూపిస్తే.. నిజాలు నిగ్గు తేలతాయి. అప్పుడు, చంద్రబాబు తన చిత్తశుద్ధి నిరూపించేసుకోవచ్చు. 

ఇంకా నయ్యం.. అడ్డంగా బుక్కయిపోయినాక, చంద్రబాబు ఆ వ్యవహారంలో ఇంకా నిజాయితీని నిరూపించుకుంటారా.? ఛాన్సే లేదు. 'అది పొరుగు రాష్ట్రంలో జరిగిన గొడవ.. దాని గురించి ఇక్కడ చర్చించమనడమేంటి.?' అన్నది నేడు అసెంబ్లీలో మంత్రి ఎర్రన్నాయుడుగారి ఉవాచ. అవునా.? అలాగైతే, వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసు ఎక్కడిది.? ఎప్పటిది.? అది కూడా హైద్రాబాద్‌లో నమోదయ్యిందే.. ఆ లెక్క, ఆ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చర్చ ఎందుకు జరుగుతోందట.! 

ఏదిఏమైనా, చట్ట సభల్లో ఇదొక కొత్త సంప్రదాయం. ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ అసెంబ్లీలో 'సినిమాలు' చూపించుకుంటూ పోతే, చట్ట సభల తాలూకు విలువైన సమయం.. ఆ సినిమాలతోనే నీరుగారిపోతుంది. ఈ కొత్త సంప్రదాయాన్ని.. కొత్త రాష్ట్రం.. కొత్త రాజధాని.. కొత్త అసెంబ్లీలో ప్రవేశపెట్టిన చంద్రబాబు సర్కార్‌ ఘనత చరిత్రలో ఓ చెత్త పేజీలా మిగిలిపోతుందన్నది నిర్వివాదాంశం.

Show comments