ట్రైలర్ వస్తూనే సంచలనాలు షురూ చేసింది. యూ ట్యూబ్ రికార్డుల దుమ్ము దులిపేస్తోంది. 'బాహుబలి ది కంక్లూజన్' ట్రైలర్ సోషల్ మీడియాలో విడుదలైన కొద్ది గంటల్లోనే 70 లక్షల వ్యూస్ దాటేసింది. క్షణ క్షణానికీ వ్యూస్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. దాంతో, ఇప్పటిదాకా తెలుగు సినిమాకి సంబంధించి వున్న గత రికార్డులన్నీ గల్లంతయిపోవడానికి ఎంతో టైమ్ కూడా పట్టేలా లేదు.
ప్రస్తుతం యూ ట్యూబ్‌లో 'బాహుబలి ది బిగినింగ్' ట్రైలర్ జోష్ చూస్తోంటే, పది గంటల్లోనే కోటి వ్యూస్ దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.! తెలుగుతోపాటు, తమిళ, హిందీ వెర్షన్‌లలో ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ రోజు ఉదయం ఎంపిక చేసిన థియేటర్లలో ట్రైలర్‌ని విడుదల చేయడంతో, థియేటర్ల వద్దకు జనం పోటెత్తారు. ఇదీ 'బాహుబలి' మేనియా అంటే.!
దేశవ్యాప్తంగా చూసుకుంటే, ఇప్పుడన్ని భాషల్లోనూ అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సినిమా 'బాహుబలి ది బిగినింగ్' మాత్రమేనన్నది నిర్వివాదాంశం. ఇప్పుడే 'బాహుబలి' మేనియా ఇలా వుంటే, సినిమా విడుదలకు దగ్గరయ్యేకొద్దీ, ఆ మేనియా ఏ స్థాయిలో వుంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. 'బాహుబలి'.. ఇది రాజమౌళి అద్భుతం.. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకి ఇంతటి గౌరవం దక్కడం.. తెలుగువారందరికీ గర్వకారణం.