పాపం షారూక్: చేతులు కాలాక ప్రచారం

ఇన్నేళ్ల అనుభవం ఏమైపోయింది.. ప్రమోషన్ ను కొత్తపుంతలు తొక్కించిన షారూక్ కు అసలు ఏమైంది.. ప్రస్తుతం అంతా ఇదే డిస్కషన్ మీద ఉన్నారు. ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ విషయంలో షారూక్ చాలా తప్పులు చేశాడు. దానికి మూల్యాన్ని మొదటి రోజు నుంచే అనుభవిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పుడు ఫ్లాప్ టాక్ తో నడుస్తోంది.

ఎందుకో ఈ సినిమా ప్రచారాన్ని లైట్ తీసుకున్నాడు షారూక్. చాలా పరిమితంగా ప్రచారం నిర్వహించాడు. బాలీవుడ్ స్టయిల్ ప్రమోషన్ అస్సలు కనిపించలేదు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ప్రమోషన్ ను లైట్ తీసుకున్నాడని కొందరు అంటుంటే, సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే పసిగట్టి ప్రచారాన్ని తగ్గించాడని మరికొందరు అంటున్నారు.

సోషల్ మీడియాలో ఎంత చర్చ జరిగినా షారూక్ సినిమా అట్టర్ ఫ్లాప్ అనేది మాత్రం వాస్తవం. ఇక్కడితో ఈ సినిమాను వదిలేస్తే సరిపోయేది. కానీ షారూక్ ఇప్పుడు కొత్తగా ప్రమోషన్ షురూ చేశాడు. దేశవ్యాప్తంగా పర్యటిస్తానంటున్నాడు. ఓవర్సీస్ ని కూడా వదలనంటున్నాడు. 

నిజానికి బాలీవుడ్ లో ఓ సినిమా విడుదలైన తర్వాత స్టార్స్ ఎవరూ ప్రమోట్ చేయరు. మరీ ముఖ్యంగా ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమా జోలికి అస్సలు వెళ్లరు. కానీ షారూక్ మాత్రం చేతులు కాలాక ఆకులు పట్టుకుంటానంటున్నాడు. ఫ్లాప్ అయిన సినిమా షారూక్ ప్రచారంతో హిట్ అయిపోతుందా..?

Show comments