చెంప ఛెళ్ళుమంది బాసూ..

రాజకీయాల్లోకి ఎవరైనా ఎందుకొస్తారు.? అన్న ప్రశ్నకు రాజకీయ నాయకులంతా చెప్పేది ఒకటే సమాధానం.. అదే ప్రజాసేవ అని. ఇది నిజమేనా.? అంటే, ఎంతమాత్రం కాదనే సమాధానం సాధారణ ప్రజానీకం నుంచి వస్తుంది. ప్రస్తుత రాజకీయాల్లో 'సేవ' కోసం వచ్చే నాయకుల్ని బూతద్దంలో వెతకాలి. ఇది నిష్టుర సత్యం. 

అసలు, రాజకీయాల్లోకి తానెందుకు వచ్చానో, ఎమ్మెల్యేగా ఎందుకు గెలవాలనుకుంటున్నానో చెబుతూ పెద్ద షాకే ఇచ్చాడో అభ్యర్ధి. ఉత్తరప్రదేశ్‌లోని దక్షిణ ఆగ్రా నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాడు గోపాల్‌ చౌదరి. ప్రజల్ని ఉద్ధరించేస్తానని మాత్రం ఓటర్ల దగ్గరకు వెళ్ళడంలేదీయన. ఇదే మరి వెరైటీ అంటే. 'రాజకీయాల్లోకి వచ్చింది డబ్బు సంపాదన కోసమే. అయితే, అదెలాగో నాకు తెలియదు. ఎమ్మెల్యేని అయితే అధికారులే నేర్పిస్తారు. డబ్బు సంపాదించుకుంటాను. ఎమ్మెల్యేగా గెలవడం ద్వారా దక్కే ప్రయోజనాలన్నీ పొందుతాను..' అంటూ నిర్కొహమాటంగా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెబుతున్నాడాయన. 

రాజకీయాల్లోకి డబ్బు సంపాదించడం కోసమే వస్తారా.? అని ఎవరైనా గోపాల్‌ చౌదరిని విమర్శించ్చుగాక. చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేది డాష్‌ డాష్‌.. అన్నట్టు రాజకీయ నాయకులు పైకి చెప్పే మాటలకీ, లోలోపల వారి ఆలోచనలకీ అసలు పొంతనే వుండదు. కానీ, గోపాల్‌ చౌదరి అలా కాదు. తానేమనుకుంటున్నాడో స్పష్టంగా చెప్పేశాడు. ఇక, ఇందులో వివాదం ఏముంది.? 

ఓ వ్యక్తి 127 కోట్ల మందిని మభ్యపెట్టి, ప్రధాని పీఠమెక్కారంటూ డైరెక్ట్‌గా ప్రధాని నరేంద్రమోడీపైనే ఆయన విమర్శలు గుప్పించేశాడు. 127 కోట్ల మందిని మభ్యపెట్టగలిగిన టాలెంట్‌ ఆయన వద్ద వుంది గనుక, ఆయన అడుగుజాడల్లో తాను నడుస్తున్నానని గోపాల్‌ చౌదరి చెప్పడం మరో విశేషం. ప్రస్తుత రాజకీయాలు ఎలా తగలడ్డాయో గోపాల్‌ చౌదరి నిర్మొహమాటంగా తేల్చి చెప్పేశాడు. అతనెలాంటివాడు, గెలుస్తాడా, ఓడతాడా.. వంటివన్నా వేరే అంశాలు. 

రాజకీయం అంటే దుర్మార్గం.. రాజకీయం అంటే దోపిడీ.. రాజకీయం అంటే వంచన.. రాజకీయం అంటే ఇంకోటేదో.. ఇవన్నీ వాస్తవాలు. వార్డు మెంబర్‌గా గెలిచినోడు కూడా, లక్షలు, వీలైతే కోట్లు వెనకేసుకుంటున్న రోజులివి. అందుకే, రాజకీయాల్లో కుళ్ళుని కడిగేయలేకపోయినా.. చెంప ఛెళ్ళుమనేలా ఆ కుళ్ళు గురించి మాట్లాడిన గోపాల్‌ చౌదరికి హ్యాట్సాఫ్‌ చెప్పితీరాల్సిందే.

Show comments