ఆంధ్రప్రదేశ్‌పై ఇంత విషం చిమ్మాలా.?

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, కేంద్ర వాణిజ్య శాఖల మంత్రికి రాసిన లేఖ వివాదాస్పదమవుతోంది. అదీ ఆంధ్రప్రదేశ్‌ని ఉద్దేశించి కావడమే గమనార్హమిక్కడ. 'తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ముందడుగు వేయాలి..' అని కేటీఆర్‌ మాత్రమే కాదు, ఆయన తండ్రి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా చెబుతున్నారు. అదే సమయంలో, ఆంధ్రోళ్ళతో పంచాయితీ అయిపోలేదని చెబుతున్నారు. మొన్నటికి మొన్న కేటీఆర్‌ సోదరి, నిజామాబాద్‌ ఎంపీ కవిత, 'జై ఆంధ్ర.. జై తెలంగాణ.. జై హింద్‌' అన్నారు. తెలుగు ప్రజలంతా కలిసిమెలిసి అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలని నినదించారు. 

పెదాల మీద నుంచి వచ్చే మాటలకీ, మనసుల్లో పేరుకుపోయిన విధ్వేషాలకీ చాలా తేడా వుంది. తెలంగాణ సమాచారాన్ని కాపీ చేశారంటూ, పరిశ్రమల శాఖ తరఫున ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు కేటీఆర్‌. కేవలం ఫిర్యాదు మాత్రమే అయితే ఆయన్ను తప్పు పట్టడానికి వీల్లేదు. కాపీ చేయడం అనేది భావదారిద్య్రం. ఇంత దిగజారుడుతనాన్ని ఎవరూ సమర్థించరు. చంద్రబాబు ప్రారంభించిన ఆపరేషన్‌ ఆకర్షని (వైఎస్సార్సీపీ ఎంపీ ఎస్పీవై రెడ్డిని టీడీపీలోకి చంద్రబాబు లాగేయడం ద్వారా) తెలంగాణ రాష్ట్రలోని అధికార టీఆర్‌ఎస్‌ కాపీ కొట్టేసింది. ఆ తర్వాత కేసీఆర్‌ని చూసి, ఎమ్మెల్యేలను ఎలా లాగెయ్యాలో చంద్రబాబు నేర్చుకున్నానుకోండి.. ఇది వేరే విషయం. 

రాజకీయం వేరు, ప్రభుత్వం వేరు. పరిపాలన వేరు, విధ్వేషాలు వెదజల్లడం వేరు. తమ ప్రభుత్వ సమాచారాన్ని కాపీ కొట్టినప్పుడు ఆంధ్రప్రదేశఫై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదులు చేయొచ్చు, కేసులు కూడా పెట్టుకోవచ్చుగాక. కానీ, కాపీ కొట్టడం ద్వారా 'ఈవోఈబీ' (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) స్ఫూర్తి దెబ్బతిన్నందున, ర్యాంకింగుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ని తప్పించాలని కేటీఆర్‌, కేంద్రమంత్రిని కోరడమంటే, ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకేముంటుంది.? దీన్నే విషం చిమ్మడం అనాలేమో.! 

అయినా, ప్రపంచానికి పాఠాలు తానే చెప్పానని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ 'కాపీ' విధానాల్ని అవలంభించడమేంటి.? అక్కడేం జరిగిందన్నది ముందు ముందు తేలుతుంది. ఈలోగా ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ మాత్రం సర్వనాశనమైపోతుంది. 'కాపీ కొట్టాల్సిన అవసరం మాకు లేదు.. మా ర్యాంకింగ్‌ రెండు.. తెలంగాణ ఇంకా వెనకబడి వుంది..' అని ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈ వివాదంపై స్పందన వచ్చినా, వ్యవహారం కోర్టులదాకా వెళ్ళిన దరిమిలా తెలుగు రాష్ట్రాల మధ్య ఇదో సరికొత్త వివాదంగా ముదిరి పాకాన పడే ప్రమాదం లేకపోలేదు. 

ఒక్కటి మాత్రం నిజం. తెలుగు రాష్ట్రాలు సఖ్యతతో మెలగాలి. సమాచారం ఇచ్చిపుచ్చుకున్నా, ఆ పని చేయకపోయినా ఫర్వాలేదు, వివాదాలేమన్నా వుంటే ఒక్క చోట కూర్చుని పరిష్కరించుకోవాలి. అంతే తప్ప, కేంద్రం వద్ద ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటే (అది ఏపీ చేసినా తెలంగాణ చేసినా తప్పే) ఇరు రాష్ట్రాలకూ మంచిది కాదు. కానీ, ఫిర్యాదులతో ఆగకుండా, ఇదిగో ఇలా విషం చిమ్మడమంటే, ఇరు రాష్ట్రాల్లోనూ అధికారంలో వున్నవారు ప్రజలకు ఏం సంకేతాలు పంపుతున్నట్లు.?

Show comments