వెంకయ్య కన్ఫెషన్ : పుకార్లు... నిజమే!

వెంకయ్యనాయుడు తన మనసులో మాటను పంచుకున్నారు. ఈదఫా ఉన్నదున్నట్టుగా పంచుకున్నారు. ఎటూ ఉపరాష్ట్రపతి పదవిలోకి వెళుతున్న నేపథ్యంలో ఇక రాజకీయంగా ముసుగు కప్పి చెప్పేమాటల అవసరం తనకెందుకుని భావించారో ఏమోగానీ..  మొత్తానికి మనసులో ఉన్న అసంతృప్తిని, చిన్నపాటి బాధా వీచికను ఆయన నిర్మొగమాటంగా బయటపెట్టుకున్నారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంలో.. కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకుని, సుదీర్ఘకాలం సేవలందించిన భాజపాను వీడి వెళుతున్నందుకు తనలో మెదలుతున్న భావసంచలనాన్ని ఆయన అందరి ముందూ ఆవిష్కరించారు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. ఆదివారం నాటి వెంకయ్య మాటలను బట్టి.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ఆయనకు ఇష్టం లేదంటూ ఆ సమయంలో వచ్చిన పుకార్లన్నీ నిజమే అనిపిస్తోంది. 
వెంకయ్యనాయుడు మాటల్లో అయితే.. ‘‘అలాంటి ప్రచారం జరిగింది.. అందులో నిజంలేదు..’’ అంటూనే... ‘‘తాను ఎన్నడూ రాజ్యాంగబద్ధ పదవిని కోరుకోలేదని, 2019 ఎన్నికలు ముగిసిన కొన్నాళ్లకు రాజకీయాలనుంచి తప్పుకోవాలనుకున్న తన కల తీరకుండా పోతోందని’’ బాధను కూడా పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థి చేసిన తర్వాత.. ఆయనను కేబినెట్ తప్పించడానికి ఇది మోదీ వేసిన స్కెచ్ అంటూ చాలా ప్రచారం జరిగింది. ఈ అభ్యర్థిత్వం వెంకయ్యకు ఇష్టంలేదని కూడా అనేక కథనాలు మీడియాలో వచ్చాయి. నామినేషన్ వేసిన తర్వాత.. ఒకటి రెండు రోజులు ఎవ్వరికీ అందుబాటులో లేకుండాపోయిన వెంకయ్యనాయుడు.. ఆదివారం నాడు అలాంటి రకరకాల ప్రచారాల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. 

వెంకయ్య సుదీర్ఘ వ్యాఖ్యానం ఇచ్చారు గానీ.. స్థూలంగా పరిశీలించినప్పుడు.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి చేయడం ఆయనకు ఇష్టంలేదంటూ వచ్చిన పుకార్లన్నీ నిజమే అని అర్థమవుతుంది. అయితే.. ఆ అసంతృప్తి మొత్తం పార్టీని వీడవలసి వస్తున్నందుకే తప్ప మరొకటి కాదంటూ వెంకయ్య వివరణ ఇచ్చుకున్నారు. వాజపేయి, అద్వానీల గురించి రిక్షాల్లో ప్రచారం చేయడం, గోడల మీద రాతలు, పోస్టర్లు అంటించడం దగ్గర్నుంచి తన జీవితం ప్రారంభం అయిందని.. ఇంత సుదీర్ఘకాలం పార్టీతో అనుబంధాన్ని వీడడం ఇష్టంలేకుండా పోయిందని చెప్పుకున్నారు. అలాగే తానెప్పుడు ఎక్కడకు వెళ్లినా.. హోటళ్లలో దిగకుండా, స్థానికంగా పార్టీ సహచరులు, మిత్రుల ఇళ్లలో దిగడం అలవాటు అని.. ఎక్కడ నచ్చితే అక్కడ రోడ్లపక్కన బండి మీద అయినా చిరుతిళ్లు తినడమూ గట్రా తనకు ఇష్టమని.. అలా స్వేచ్ఛగా కలివిడిగా జీవించడం తన శైలి కాగా, ఇక మీదట ప్రోటోకాల్ నిబంధనల కారణంగా ఇలాంటివన్నీ దూరం అవుతాయనే బాధే తప్ప మరొక అసంతృప్తి తనకు లేదని వెంకయ్య చెప్పుకున్నారు. 

నిజానికి ఈ పదవికి తాను మరికొందరి పేర్లను సిఫారసు చేశానని, కానీ పార్టీలో సీనియర్లు చాలామంది తన పేరేర చెప్పడంతో, ఆ మేరకు అమిత్ షా, మోదీ కూడా గట్టిగా అడగడంతో ఒప్పుకోవాల్సి వచ్చిందని వెంకయ్యనాయుడు చెప్పారు. ‘కేబినెట్ నుంచి తప్పిస్తున్నందుకు’ అనే చిన్న వాక్యం తప్ప.. వెంకయ్యలో అసంతృప్తి మాత్రం నిజమే అని ఆయన కన్ఫెషన్ లోనే ఒప్పుకున్నట్లయింది. 

Show comments