అద్దాల మేడ: రోజా టైమింగ్‌ అదిరింది

సినీ పరిశ్రమని అద్దాల మేడగా అభివర్ణించారు సినీ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా. 'అద్దాల మేడ మీద రాయి విసరడం తేలిక.. కానీ, అది తప్పని తేలాక.. ఆ అద్దాల మేడను తిరిగి నిర్మించి ఇవ్వగలమా.?' అంటూ అమాయకంగా ప్రశ్నించేశారు రోజా. 

టాలీవుడ్‌ని కుదిపేస్తున్న డ్రగ్స్‌ ప్రకంపనలపై రోజా తనదైన స్టయిల్లో స్పందించారు. రాజకీయాలతో సంబంధం వున్న 'పెద్ద'వారిని వదిలేసి, చిన్న చిన్నవాళ్ళని టార్గెట్‌ చేయడంతో పలు అనుమానాలొస్తున్నాయనీ, అసలు దోషుల్ని శిక్షిస్తే.. సిట్‌ విచారణకు ప్రతి ఒక్కరూ మద్దతిస్తారని రోజా చెబుతున్నారు. 

డ్రగ్స్‌ తీసుకుంటున్న విద్యార్థులు మైనర్లు గనుక.. వారి పేర్లు బయటకి రావు. డ్రగ్స్‌ తీసుకుంటున్న సాఫ్ట్‌వేర్‌ రంగానికి చెందినవారికీ నోటీసులు వెళ్ళవు, వారినీ విచారణకు పిలవరు.. కానీ, సినీ పరిశ్రమ తేలిగ్గా టార్గెట్‌ అయిపోతుంటుంది.! అయినాగానీ, తెలుగు సినీ పరిశ్రమను తాము టార్గెట్‌ చేయడంలేదంటూ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ తెగేసి చెప్పడమే కాదు, తమ శాఖను డిఫేమేషన్‌ చేసేలా ఎవరైనా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసేస్తారు.! 

సాక్షాత్తూ తెలంగాణ హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, బీజేపీ నేత రఘునందన్‌ పబ్‌లకు వెళ్తారనీ, డ్రగ్స్‌ తీసుకుంటారనీ ప్రకటించేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అయినా, రాజకీయ నాయకుల వ్యవహారంపై 'సిట్‌' స్పందించదుగాక స్పందించదు.! 

ఓటుకు నోటు కేసులోనూ ఇంతే. నానా హంగామా జరిగింది అప్పట్లో. 'బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు..' అంటూ సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, 'బస్తీమేసవాల్‌' అన్నారు. ఏమయ్యింది.? అసలది ఏమయ్యిందో ఎవరికీ తెలియని పరిస్థితి. కానీ, టాలీవుడ్‌ విషయంలో మాత్రం చాలా 'ఓవరాక్షన్‌' జరుగుతోంది. రాజకీయ నాయకులు మాట్లాడతారు, మీడియాకి లీకులు అందుతాయి. 'సిట్‌' మాత్రం 'చట్టం తన పని తాను చేసుకుపోతుంది..' అంటూ తమ విచారణ తాము చేసుకుపోతుండడం గమనార్హం. 

రాజకీయ నాయకులదేముంది.? ఆరోపణలొస్తాయి.. ఒక్కోసారి జైలుకీ వెళ్ళొస్తారు.. ఆ తర్వాత దులిపేసుకుంటారు. సినీ పరిశ్రమ పరిస్థితి అలాకాదు కదా.! సినీ పరిశ్రమలోనూ పెద్దోళ్ళ పరిస్థితి వేరు. చిన్నా చితకా నటీనటులు, టెక్నీషియన్ల పరిస్థితి వేరు. 'గుడ్‌విల్‌' పోతే అంతే సంగతులు. ఈ విషయంలో రోజా ప్రశ్నించిన తీరు అభినందనీయమే.

Show comments