ఆంధ్ర లో పుష్కర స్నానం పవిత్రం కాదా.?!

మనిషన్న ప్రతివాడికీ ఏవో సెంటిమెంట్లుంటాయి. నాస్తికులకు, హేతువాదులకు ఉండకపోవచ్చు. సెంటిమెంట్లు కొందరికి ఒకటో రెండో ఉంటే, మరికొందరికి బోలెడుంటాయి. కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తి, ఆధ్యాత్మికత పొంగిపొర్లుతున్న విషయం తెలిసిందే. భక్తి టీవీ ఛానెళ్లతోపాటు న్యూస్‌ ఛానెళ్లు కూడా భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ, పండితులతో ప్రవచనాలు చెప్పిస్తూ, గుళ్లూ గోపురాలను నట్టింట్లోకి తెచ్చేస్తున్నాయి. దీంతో జనాలకు బోలెడు కొత్త కొత్త సెంటిమెంట్లు తగులుకున్నాయి. 

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సెంటి'మెంటల్‌'గా తయారై పండుగలు పబ్బాలు, జాతర్లు, పుష్కరాలు ప్రభుత్వాల తరపునే నిర్వహిస్తూ కోట్లు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యమంత్రుల దగ్గర వాస్తు, జ్యోతిష పండితుల హవా నడుస్తోంది. వారి సలహాలు తీసుకోనిదే సీఎంలు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. చిన్న పనికీ పెద్ద పనికీ ముహూర్తాల గోల ఎక్కువైపోయింది.  గత ఏడాది గోదావరి పుష్కరాల్లో సెంటిమెంట్లు రాజ్యమేలాయి. చివరకు ఆ సెంటిమెంట్లే రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు ముప్పయ్‌మంది చనిపోవడానికి కారణమైంది. 

ఇంకా ఏవో కారణాలున్నా అక్కడి ఘాట్‌పై ప్రచారం ఎక్కువ జరగడం దుర్ఘటనకు మూల కారణమైంది. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనేది ఇప్పటివరకు తేలలేదు. తేలుస్తారనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఈ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబూ కారకుడనే ఆరోపణలున్నాయి కదా. గోదావరిలో తప్పనిసరిగా గుప్పుడు మట్టి వేయాలని టీవీల్లో ప్రవచనాలు చెప్పే ఒక  ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త చెప్పారని, ఆ సెంటిమెంటు ప్రజలపై బాగా ప్రభావం చూపిందని, అది కూడా దుర్ఘటనకు దారి తీసిందంటారు. భద్రాచలంలో శ్రీరామ నవమి ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ప్రతి ఏడాది వివాదం జరుగుతూనే ఉంది. 

ఇలాంటి సెంటిమెంట్లు, వివాదాలు అనేకమున్నాయి.  తాజాగా తెలంగాణ పండితులు కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఓ సెంటిమెంటు లేవదీశారు. ఇది వివాదంగా కూడా మారొచ్చు. అదేమిటంటే...ఆంధ్రాలోని కృష్ణానది కొంతభాగం పుష్కర స్నానాలకు పనికిరాదనేది ఈ సెంటిమెంటు సారాంశం. అక్కడ స్నానం చేస్తే అది పుష్కర స్నానంగా లేదా పవిత్ర స్నానంగా పరిగణించడానికి వీల్లేదట....! ఇందుకు కారణముంది. కృష్ణా నది  తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించి కృష్ణా జిల్లా హంసలదీవిలో సముద్రంలో కలుస్తుంది. 

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ , నల్గొండ జిల్లాలో మీదుగా ప్రవహించే  నది  కృష్ణా జిల్లా  జగ్గయ్య పేట  సమీపంలోని ముక్త్యాల వద్ద ఆంధ్రాలోకి ప్రవేశిస్తుంది. అయితే చంద్రబాబు సర్కారు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసింది. ప్రతి రోజు గోదావరి నుంచి వెయ్యి క్యూసెక్కుల నీరు కృష్ణాలో కలుస్తోంది. కృష్ణలో గోదావరి నీరు కలిసిన చోటు నుంచి ఆ రెండు నదుల నీరు కలిసి ప్రవహించినంత మేరకు పుష్కర స్నానం చేయకూడదని తెలంగాణ పండితులు చెబుతున్నారు. ఈ మొత్తం దూరం 63 కిలోమీటర్లు. గోదావరి కలిసిన కృష్ణలో స్నానం చేసినట్లయితే గోదావరిలో స్నానం చేసినట్లే అవుతుందిగాని కృష్ణలో చేసినట్లు కాదని చెబుతున్నారు. 

కాబట్టి ఆ ప్రాంతాలవారంతా తెలంగాణలో కృష్ణా నది ప్రవహించే హుజూర్‌నగర్‌, మట్టపల్లి, బీచుపల్లి మొదలైన చోట్ల పుష్కర స్నానాలు చేయాలంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మరోలా ప్రచారం చేస్తోంది. కృష్ణా-గోదవరి సంగమ ప్రాంతంలో పుష్కర స్నానం చేయడం శుభప్రదమని, ఇది ఎంతో అదృష్టమని చెబుతోంది. సంగమంలో స్నానం చేయడం వల్ల పుష్కర స్నానఫలం ఎక్కువగా దక్కుతుందట...! తెలంగాణ పండితులు చెప్పిన విషయాన్ని భక్తులు తలకెక్కించుకున్నట్లయితే తెలంగాణలోని పుష్కర ఘాట్లకు తాకిడి ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలోని సరిహద్దులో ఉన్న ఆంధ్రా ప్రాంతవాసులంతా పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోతారు. టీవీ ఛానెళ్లవారు ఈ అంశాన్ని పెద్ద చర్చనీయాంశంగా చేస్తారనడంలో సందేహం లేదు. 

Show comments