రాజుగార్ని కొట్టబోయినందుకు 'బహుమతి'

నిండు సభలో కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజుకి అవమానం జరిగింది. శివసేన ఎంపీలంతా కలిసి ఆయనపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. అలా దాడికి యత్నించినవారిలో కేంద్ర మంత్రి అనంత్‌ గీతే కూడా వున్నారు. వ్యవహారం ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌కి సంబంధించినది. విమాన సిబ్బందిపై దాడి చేసినందుకుగాను విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధిస్తే, ఆయనకు మద్దతుగా శివసేన ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేయడం, ఈ క్రమంలో అశోక్‌ గజపతిరాజుపై దాడికి యత్నించడం చకచకా జరిగిపోయాయి. 

మామూలుగా అయితే, కేంద్ర మంత్రిపై దాడికి యత్నించినందుకుగాను మరో కేంద్ర మంత్రి అనంత్‌ గీతేతోపాటుగా శివసేన ఎంపీలందర్నీ పార్లమెంటు నుంచి సస్పెండ్‌ చేయాలి. అన్నిటికీ మించి, శివసేనను ఎన్డీయే కూటమి నుంచి బయటకు పంపాలి. కానీ, ఇక్కడ శివసేనకు బీజేపీ 'బహుమతి' ఇచ్చింది. అవును, విమానయాన సంస్థలు రవీంద్ర గైక్వాడ్‌పై విధించిన నిషేధాన్ని తొలగించాయి. అదీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో. ఓ కేంద్రమంత్రికి అవమానం జరిగితే, ఇదా ప్రధాని నరేంద్రమోడీ వ్యవహరించాల్సిన తీరు.?

'జరిగిన ఘటనకు చింతిస్తున్నాను..' అని రవీంద్ర గైక్వాడ్‌ రాసిన లేఖతో మొత్తం వివాదం సద్దుమణిగిపోయింది. సిగ్గు పడాలా.? ఇంకేమన్నా అనుకోవాలా.? పార్లమెంటు జరుగుతున్న తీరు, అందులో సభ్యులకు దక్కుతున్న గౌరవం చూస్తే సిగ్గుతో తలదించుకోవాల్సిందే ఎవరైనా. ఏదీ, చంద్రబాబూ.. ఎక్కడ.? తెలుగు జాతి ఆత్మగౌరవం అనే మాటకి అర్థమెక్కడ.? అశోక్‌ గజపతిరాజుకి జరిగిన అవమానంపై ప్రధాని నరేంద్రమోడీని నిలదీయరేం.?

Readmore!
Show comments