రాజకీయ రోగానికి మందు.. ఏదీ.?

రోగానికి మందేస్తే తగ్గుతుంది.. అది క్యాన్సర్‌ రోగమైనా, కిడ్నీ రోగమైనా, ఇంకో రోగమైనాసరే.! అదే రాజకీయ రోగం సంక్రమిస్తే, దానికి మందు వుండదు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్దానం ప్రాంతానికి రాజకీయ రోగం పట్టుకుంది. అవును, అందుకే అక్కడి కిడ్నీ బాధితులకి సాంత్వన చేకూరడంలేదు. డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటుతో రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకోవవడం హేయమైన చర్యగా జనసేన పార్టీ అభివర్ణించడం గమనార్హం. 

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, ఉద్దానం కిడ్నీ బాధితుల్ని పరామర్శించి, వారి ఆవేదనను తెలుసుకుని, 'డయాలసిస్‌'పై మాట్లాడారని కాదుగానీ, డయాలసిస్‌ గురించి తెలిసినవారెవరైనాసరే, దానికన్నా ముందు వ్యాధి నివారణకోసం ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించకుండా వుండలేరు. కానీ, మంత్రి కామినేని శ్రీనివాస్‌, పవన్‌కళ్యాణ్‌ ఉద్దానం పర్యటన నేపథ్యంలో, 'త్వరలో అక్కడ కొత్తగా డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.. ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమీ లేదు..' అనే ప్రకటన చేసేసి చేతులు దులిపేసుకున్నారు. ఈ విషయాన్నే పవన్‌కళ్యాణ్‌ ఉద్దానం పర్యటనలో ప్రస్తావించారు. 

వైద్యులు సైతం, వ్యాధిని తొలి దశలో గుర్తిస్తే మందుల ద్వారా నయం చేయడం వీలవుతుందని చెబుతున్నారు. డయాలసిస్‌ని ఆరోగ్యశ్రీ చేర్చాక, కిడ్నీ వ్యాధి పీడిత ప్రజలకి కాస్త ఉపశమనం లభించినా, ఆ వ్యాధి పీడితుల సంఖ్య తగ్గలేదు సరికదా.. ఇంకా పెరుగుతుండడం.. పరిస్థితి తీవ్రతని చెప్పకనే చెబుతోంది. పుష్కరాల కోసం వందల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, ఉద్దానం కిడ్నీ వ్యాధి పీడితుల కోసం 100 కోట్లు ఖర్చు చేయలేదా.? అన్న పవన్‌ సూటి ప్రశ్న కూడా ఆహ్వానించదగ్గదే. 

ఇక, ప్రభుత్వానికి పవన్‌కళ్యాణ్‌ 48 గంటల డెడ్‌లైన్‌ పెట్టడం, 15 రోజుల్లో పార్టీ తరఫున వేసిన నివేదికను తెప్పించుకుని, ప్రభుత్వాన్ని కలుస్తానని చెప్పడం.. ఇదంతా ప్రస్తుతానికి షరా మామూలు రాజకీయమే. డెడ్‌లైన్‌ తర్వాత పవన్‌కళ్యాణ్‌ ఎలాంటి రాజకీయ కార్యాచరణను చేపడ్తారు.? 15 రోజుల తర్వాత నివేదిక అందుకుని, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారు.? అన్నదానిపై ఆయన చిత్తశుద్ధి ఆధారపడి వుంటుంది. 

ఏదిఏమైనా, ఉద్దానం మరోమారు వార్తల్లోకెక్కింది. అక్కడి కిడ్నీ వ్యాధి బాధితుల్ని, వారి వెతల్ని మరో మారు ప్రపంచానికి చూపింది పవన్‌కళ్యాణ్‌ ఉద్దానం టూర్‌. ముందు మందు పడాల్సింది రాజకీయానికి. ఆ మందు సరిగ్గా పనిచేస్తే, ఆ తర్వాత కిడ్నీ బాధితుల సంఖ్యను తగ్గించే చర్యల వైపుగా అడుగులు పడ్తాయి. ఆ తర్వాత డయాలసిస్‌ అన్న మాట విన్పించదు. కానీ, అదంతా జరిగే పనేనా.? డయాలసిస్‌ పేరుతో కాసులు దండుకుంటున్న 'మెడికల్‌ రాక్షసుల'కు వత్తాసు పలుకుతున్న రాజకీయం, తద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోవడానికి సిద్ధంగా వుంటుందా.? ఛాన్సే లేదు.

Show comments