పొద్దున లేస్తే ఉత్తరాది అహంకారంపై పూనకం వచ్చినట్టు ఊగిపోయే జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మరి అదే ఉత్తరాదికి చెందిన నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేయాలని ఆంధ్ర రాష్ట్రమంతా గొంతు చిరిగిపోయేలా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి మరిచిపోయారా?. నరేంద్రమోదీ దేశాన్ని రక్షించేందుకు పుట్టిన దైవాంశ సంభూతుడన్నంత రేంజిలో ప్రచారం చేశావే అప్పుడు ఆయన ఉత్తరాది అహంకారానికి కాబోయే ప్రతినిధి అని గుర్తించలేదా. మోడీ బీసీ నాయకుడు, ఒక బీసీ నాయకుడు ప్రధానమంత్రి అవుతుంటే ఆయన్నే తిడతావా అంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై ఎన్నికల ప్రచారంలో నిప్పుల చెరిగిన సంగతిని నువ్వు మరిచిపోయినా ప్రజలు ఇంకా గుర్తుంచుకునే ఉన్నారు పవన్. సరే ఇప్పటికైనా నిజంగా పవన్ కళ్యాణ్‌కు ఉత్తరాది అధిపత్యం మీద అంత కోపమే ఉంటే నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న వివక్ష, అహంకార పూరిత వైఖరిపై ఎందుకు తన ప్రశ్నలను సంధించడు.
పచ్చమీడియాలో ప్రచారం చేసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఉదారంగా నిధులేమీ కేటాయించడం లేదు. అడుగడుగునా మనకు వివక్షే మిగులుతోంది. ప్రత్యేక హోదాకు కేంద్రం శాశ్వతంగా మంగళం పాడింది. మరి ఈ విషయాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు మోడీని ప్రశ్నించడం లేదు. రైల్వే బడ్జెట్‌లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల నిధులు, పైపెచ్చు ఎన్నో రైల్వే ప్రాజెక్టులను కేటాయిస్తే తెలుగు రాష్ట్రాలకు కేవలం రూ. 5వేల కోట్లు విదిల్చినప్పుడు పవన్ కళ్యాణ్‌కు ఉత్తరాది పక్షపాతం కనబడలేదా..జాతీయ రహదారుల నిర్మాణం కోసం మనకు కేటాయించిన నిధులు ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా స్వల్పం. మరి ఈ అంశాలపై ప్రధాని మోదీకి సురుకు తగిలేలా నీ ట్విట్టర్‌లో ఒక్క పోస్టన్నా పెట్టావా పవన్.
టీటీడీ ఈవోగా ఉత్తరాది ఐఏఎస్ అధికారిని నియమించడంపై విమర్శలు గుప్పిస్తున్న పవన్ కళ్యాణ్ అసలు తాను చేస్తున్న విమర్శలు ఎవరిని ఉద్దేశించో ధైర్యంగా చెప్పలేని దయనీయస్థితిలో ఉన్నాడు. కేంద్రం ఒత్తిడి వల్లే చంద్రబాబు ఉత్తర భారతదేశానికి చెందిన అనిల్ కుమార్ ను టీటీడీ ఈవోగా నియమించారనే విషయం అపర మేథావి అయిన పవన్‌కు తెలియదా. ఒకవేళ తెలిసే ఉంటే ఈ డొంక తిరుగుడంతా లేకుండా నేరుగా చివరికి మా పుణ్యక్షేత్రాలపై కూడా మీ పెత్తనమేంటి అని నేరుగా మోదీకి ఒక ట్వీట్ చేయొచ్చుగా. నిజంగా దక్షిణాదిపై ప్రేమే ఉంటే పవన్ చేయాల్సిన పనులు ట్వీట్‌లు కాకుండా చాలానే ఉన్నాయి.