'కబాలి'.. వాట్‌ ఏ మేనియా.?

'కబాలి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. థియేటర్ల పరిసరాలన్నీ జాతరను తలపిస్తున్నాయి. ఇసకేస్తే రాలనంత రద్దీగా థియేటర్లు వున్న ప్రాంతాలు మారిపోయాయి. తమిళనాడులోనే కాదు, తెలుగునాట కూడా దాదాపు ఇదే పరిస్థితి. విదేశాల్లోనూ 'కబాలి' కోసం అభిమానులు బారులు తీరారు. బ్లాక్‌ మార్కెటింగ్‌లో 'కబాలి' సరికొత్త సంచలనాల్ని సృష్టిస్తోంది. తమిళనాడులో అయితే బ్లాక్‌ మార్కెట్‌కి ఆకాశమే హద్దు అన్నట్లుగా వుంది పరిస్థితి. 

ఇక, తెలుగులో 'కబాలి'ని చూసేందుకు సెలబ్రిటీలు కూడా క్యూ కట్టేశారు. దాదాపు తెలుగు సినీ ప్రముఖులంతా తొలి రోజు 'కబాలి' తొలి సో చూసేందుకు పోటీ పడ్డం గమనార్హమిక్కడ. 'కబాలి' అంటే ఓ సినిమా మాత్రమే కాదు, అంతకు మించి.. అంటున్నారు 'కబాలి' ఫీవర్‌లో ఊగిపోతోన్న సినీ ప్రముఖులు. చెన్నయ్‌తోపాటు హైద్రాబాద్‌, విజయవాడల్లో 'కబాలి' పీవర్‌ పీక్స్‌కి వెళ్ళిపోయింది. 

విజయవాడలో అయితే, పిఎన్‌ బస్‌ స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 'వై స్క్రీన్స్‌' మల్టీప్లెక్స్‌ నిర్వాహకులు వికలాంగులతోపాటుగా, క్యాన్సర్‌ పేషెంట్లకు ఉచితంగా 'కబాలి' షో వేస్తామని ఇప్పటికే ప్రకటించేశారు. ఇది నిజంగానే కొత్త యాంగిల్‌ అని చెప్పక తప్పదు. 'కబాలి' మేనియాని క్యాష్‌ చేసుకోవడం కాదు, 'కబాలి' సినిమాతోనూ తమ సేవాభావాన్ని చాటుకోవాలనుకోవడం అభినందనీయమే. 

మరోపక్క, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కొన్ని, చెన్నయ్‌లో రజనీకాంత్‌ అభిమానులైన తమ ఉద్యోగులకు 'కబాలి' టిక్కెట్లను కొనుగోలు చేసి, వారిని థియేటర్లకు పంపుతున్నాయి.. వారికి సెలవు కూడా మంజూరు చేయడం మరో విశేషం. చెప్పుకుంటూ పోతే 'కబాలి' చిత్రాలు అన్నీ ఇన్నీ కావు. తొలిసారిగా ఇండియాలో ఓ సినిమా ప్రమోషన్‌ కోసం విమానానికి పోస్టర్‌ అతికించడం, వెండి కాయిన్స్‌.. ఇలాంటివి చాలానే వున్నాయి.  Readmore!

పబ్లిసిటీ కోసం 'కబాలి' టీమ్‌ వ్యూహాలు ఓ ఎత్తు.. అభిమానుల మేనియా ఇంకో ఎత్తు. వెరసి, తొలి రోజు 'కబాలి' వసూళ్ళను అంచనా వేయడం ఎవరి తరమూ కావట్లేదు. కాస్సేపట్లో 'కబాలి' పైనల్‌ టాక్‌ బయటకు రానుంది. టాక్‌ ఎలా వున్నా, 'కబాలి' ఎప్పటికీ ఓ సంచలనంగా ఉండిపోతుందని అభిమానులు తెగేసి చెబుతున్నారు. అదీ రజనీ అభిమానుల 'కబాలి' మేనియా.

Show comments

Related Stories :