తమిళనాడు రచ్చ.. క్లైమాక్స్ దగ్గరపడుతోంది!

తమిళనాడు రాజకీయ పరిణామాలపై భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. అక్కడ ఆట తనకు ఈజీ కాదని భారతీయ జనతా పార్టీ గ్రహించింది. అసలు సాధ్యం కాదని అర్థం చేసుకుంది. యూపీ, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కమలం చక్రాన్ని అమిత్ షా వంటి వాళ్లు తిప్పగలరేమో కానీ ద్రవిడ రాజకీయాల్లో కమలానికి అంతసీన్ లేదనే విషయం అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది.

జయలలిత వంటి దిగ్గజం లేకుండా పోయినా, శశికళ జైలుకుపోయినా కమలం అక్కడ ఏమీ చేయలేకపోయింది. అన్నాడీఎంకేలో నేతలు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతోంది. ఆఖరికి జైలు నుంచి వచ్చిన దినకరన్ అరవై మంది ఎమ్మెల్యేలను తన ఇంటి దగ్గరకు రప్పించుకున్నాడు కానీ.. బీజేపీ మాత్రం ఆరుమంది విశ్వాసపాత్రులను తయారు చేసుకోలేకపోయింది.

అమిత్ షా జోక్యం ముచ్చట కూడా ముగిసింది. ఇప్పుడు కమలం పార్టీ కూడా తమిళ రాజకీయాలను వాటి మానాన వాటిని వదిలేసి.. కేవలం రాష్ట్రపతి ఎన్నికల మీద మాత్రమే దృష్టి సారించింది. ఎలాగోలా రాష్ట్రపతి ఎన్నికలకు ఇబ్బంది లేకుండా.. అన్నాడీఎంకే బలాన్ని ఉపయోగించేసుకుంటే .. అన్నట్టుగా సాగుతున్నాయి కమలం పార్టీ ఆలోచనలు.

ఆ ముచ్చట ఒకటీ ముగిస్తే.. అవతల తమిళనాడులో ఏ నిమిషం అయినా రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ పాలన అల్లకల్లోలంగా తయారైందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు ప్రభుత్వానికి బలం లేదు.. విశ్వాస పరీక్ష పెట్టాలని మళ్లీ డీఎంకే పాత పల్లవి అందుకుంటోంది. పళనిసామి సర్కారు ఏర్పాటు అయి, విశ్వాస పరీక్ష నెగ్గి ఇంకా ఆరు నెలలు కాలేదు. దీంతో విశ్వాస పరీక్ష డిమాండ్ కు కూడా ఇప్పుడప్పుడే ఊతం లభించదు. 

ఒక్కసారి రాష్ట్రపతి ఎన్నికలు మగిస్తే.. బీజేపీనే తమిళనాడులో ప్రభుత్వాన్ని రద్దు చేయించి రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశాలు పష్కలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రజనీని బలంగానే దువ్వుతోంది. ఆయనను బీజేపీ తరపున నిలబెట్టడానికి నాగ్ పూర్ గురించి మంత్రాంగాన్ని రచిస్తూనే ఉన్నారు. కమలం పార్టీ తరపున నిలిస్తే తను కూడా తమిళనాట చెల్లని కాసు అవుతానేమో అనేది రజనీ భయంగా తెలుస్తోంది.

Show comments