ప్రియాంకని ఆ భయం వెంటాడుతోందా.?

హాలీవుడ్‌ సినిమాలో ఛాన్స్‌ రావడమంటే అదో అద్భుతమే. ఆ ఎంజాయ్‌మెంట్‌ ఓ పక్క వున్నా, ఇంకోపక్క బాలీవుడ్‌ని మిస్‌ అవుతున్నాననే ఆందోళన తనకు ఎప్పుడూ వుంటుందని ప్రియాంకా చోప్రా పదే పదే చెబుతూనే వుంది. ఆమె ఆందోళనకి అసలు కారణమేంటంటే, బాలీవుడ్‌ తననెక్కడ మర్చిపోతుందోనని.! 

నిజమే మరి, ప్రియాంకా చోప్రా బాలీవుడ్‌లో కన్పించి చాన్నాళ్ళే అయిపోతుంది. సినిమాల్లో నటించినా, నటించకపోయినా బాలీవుడ్‌ పార్టీల్లో నిత్యం కన్పిస్తే ఆ కిక్కే వేరు. కానీ, హాలీవుడ్‌ సినిమా 'బేవాచ్‌'తో బిజీ అయిపోయిన ప్రియాంకకి ముంబై రావడమే కష్టంగా మారిపోయింది. వచ్చినా, బాలీవుడ్‌ పార్టీస్‌లో పాల్గొనడం ఇంకా ఇబ్బందికరంగా మారింది. అలా, ప్రియాంక నెమ్మది నెమ్మదిగా బాలీవుడ్‌కి దూరమైపోతుందనే వాదనలుఏ ప్రముఖంగా విన్పిస్తున్నాయి. 

అవకాశాలు రావడం, రాకపోవడం ఒక ఎత్తు.. ప్రియాంక బాలీవుడ్‌కి దూరమైపోయిందన్న ప్రచారం ఇంకో ఎత్తు. రెండోదే ప్రమాదకరం. ఆ విషయం ప్రియాంకా చోప్రాకి కూడా బాగా తెలుసు. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి. ఇంగ్లీష్‌ టీవీ సిరీస్‌ 'క్వాంటికో', హాలీవుడ్‌ మూవీ 'బేవాచ్‌' పనులతో బిజీగా వున్న ప్రియాంక, ఆ కమిట్‌మెంట్స్‌ పూర్తి చేసేసుకుని, ముంబైకి వచ్చేసి, చకచకా రెండు మూడు సినిమాల్ని టేకప్‌ చేసేసి, వీలైనంత త్వరగా వాటిని కంప్లీట్‌ చేసెయ్యాలనుకుంటోందట. 

ప్రియాంక అనుకుంటోంది సరే, బాలీవుడ్‌ మళ్ళీ ప్రియాంకని ఆ స్థాయిలో అక్కున చేర్చుకుంటుందా.? వేచి చూడాల్సిందే.

Show comments