చిరంజీవి సమాధానంలో.. హుందాతనం!

చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్… ఈ నలుగురి నుంచి ప్రయోగాత్మక సినిమాలను ఆశించడం  ప్రేక్షకుల తప్పు కాదు. వీళ్లు ఎంతసేపూ సాదాసీదా మాస్ మసాలాలు, రీమేక్ సినిమాలు చేస్తూ ఉంటే.. విసుక్కోవడం కూడా తెలుగు సినీ ప్రేక్షకుడి తప్పు కాదు. వీళ్లను  ఇన్నేళ్ల పాటు అదరించిన ప్రేక్షకుడికి విసుక్కునే అర్హత ఉంది. వెర్రి అభిమానులను పక్కన పెడితే.. సదరు హీరోలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు.

నాగ్ తన బాణీ మార్చాడు, బాలయ్య ‘శాతకర్ణి’ తో ప్రత్యేకత నిరూపించుకుంటున్నాడు.. ఇక చిరు, వెంకీలు మాత్రం రీమేక్ లతోనే వస్తున్నారు. వెంకీ రీమేక్ ల విషయంలో తన వయసుకు తగిన పాత్రలను ఎంచుకొంటున్నాడు కాబట్టి.. ఆయనను ఏమనడానికి లేదు. ఎటొచ్చీ చిరంజీవే.. కార్నర్ అవుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో మీడియా కూడా ఆయననే డైరెక్టుగా అడిగింది, రీమేక్ సినిమానే ఎందుకు? ప్రయోగాత్మక సినిమాలు ఎందుకు చేయడం లేదు? ‘పీకే’ లాంటి సినిమాలు మీ నుంచి ఎక్స్ పెక్ట్ చేయలేమా? అని! మూడో ప్రశ్నకు మాత్రం చిరంజీవి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. చాలా సూటిగా చెప్పారాయన. ‘ నేను..ఆమిర్ అంత టాలెంటెడ్ కాకపోవచ్చు…’ అని!

నిజంగా చిరంజీవి ఉన్న స్థాయికి ఇది చాలా గొప్ప మాటే! ఆ స్థాయిలో ఉన్న వాళ్లు తమ పటిమ గురించి ఇలా మాట్లాడాలంటే పెద్ద మనసే ఉండాలి! ప్రతిభ విషయంలో పోలికలు పెట్టడం రైటేమీ కాదు. ఎవరి ప్రతిభ వాళ్లది. కానీ ‘పీకే’ లాంటి సినిమా మీరు ఎందుకు చేయడం లేదు.. అనే ప్రశ్నకు, చిరంజీవి చాలా హుందాతనంతో కూడిన సమాధానం ఇచ్చాడు. చాలా ప్రశ్నలకు పరమ డిప్లొమాటిక్ సమాధానాలు ఇచ్చిన మెగాస్టార్.. నోట ఈ మాట ప్రత్యేకమైనదే!

Show comments