'బాబాయ్ పవన్‌కళ్యాణ్ నిర్మించే సినిమాలో హీరోగా నటించనున్నాను.. అయితే దానికి ఇంకా టైమ్ పడుతుంది.. బాబాయ్ తన సినిమాలతో బిజీగా వున్నారు.. నేను నా సినిమాలతో బిజీగా వున్నాను.. కానీ, ఖచ్చితంగా మా నుంచి ఓ మంచి సినిమా అయితే రాబోతోంది..''
- ఇది కొన్నాళ్ళ క్రితం రామ్‌చరణ్ చెప్పిన మాట. చరణ్‌తో ఓ సినిమా నిర్మించనున్నట్లు పవన్‌కళ్యాణ్ కూడా ఓ సందర్భంలో చెప్పాడు. అయితే, అది సాధ్యమయ్యే పని కాదని జనం కొట్టి పారేశారు. కానీ, పవన్ మాత్రం ఈ సినిమా విషయంలో చాలా సీరియస్‌గానే వున్నాడట. తన సినిమాల కోసం కథల ఎంపికలో తలమునకలైపోతూనే, ఇంకోపక్క చరణ్‌తో చేయబోయే సినిమా గరించి కూడా పవన్, తన సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
హరీష్ శంకర్ లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్‌లలో ఎవరో ఒకరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశముందట. కథ మాత్రం పవన్‌కళ్యాణ్‌దేనట. ఇక్కడే తేడా కొట్టేస్తోంది కదూ.! బాబాయ్ కథ అందిస్తే, దాని ఫలితం ఎలా వుంటుందో రామ్‌చరణ్‌కి తెలియకుండా వుంటుందా.? 'జానీ', 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమాలు అలాగే తేడా కొట్టేశాయి.
ప్రస్తుతం పవన్‌కళ్యాణ్, డాలీ దర్శకత్వంలో చేయబోయే సినిమాకి సమాయత్తమవుతున్నాడు. చాన్నాళ్ళుగా ఈ సినిమా ఇదిగో.. అదిగో.. అంటూ మూలుగుతోంది తప్ప, పట్టాలెక్కడంలేదు. ఇక్కడా అదే టెన్షనట.. తన కథని డెవలప్ చేయమని పవన్ చెబుతోంటే, డాలీ తనంతట తానుగా రాసుకున్న కథని పవన్‌కి చెప్పాడు. ఇంకోపక్క తమిళ సినిమా 'వీరమ్' రీమేక్ ప్రచారమూ జరుగుతోందనుకోండి.. అది వేరే విషయం.