ఆలు లేదు.. చూలు లేదు.. అల్లుడి పేరు అన్నట్లు వుంది కదా.. కానీ టాలీవుడ్ లో ఈ లెక్కలు అప్పుడే మొదలైపోయాయి. ఎందుకంటే టాప్ హీరోల సినిమాలు ఏవీ పెద్దగా 2023 లో విడుదల కాలేదు.
రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, మహేష్ బాబు, ఇలా చాలా మంది హీరోల సినిమాలు 2024లో షెడ్యూలు అయి వున్నాయి. ప్రభాస్ బ్యాలన్స్ సినిమాలు కూడా 2024లోనే. మారుతి సినిమా మాత్రం 2025లో రావచ్చు. మహేష్ తరువాత సినిమా ఇప్పుడే కాదు. అలాగే బన్నీ సినిమా కూడా. రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాకు టైమ్ పడుతుంది. బన్నీ పుష్ప- 2 తరువాత మళ్లీ సినిమా ఎక్కడానికి కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పడుతుంది.
అందువల్ల కీలకమైన 2025 సంక్రాంతికి ప్లాన్ చేసే ఆలోచనలో వున్నారు ఒకరిద్దరు దర్శకులు. సరిగ్గా మే.. జూన్ కు మొదలుపెడితే 2025 సంక్రాంతిని టార్గెట్ చేయవచ్చు అని లెక్కలు వేస్తున్నారు.
త్రివిక్రమ్-నాని సినిమా అనేది చాలా కాలం క్రితం వినిపించింది. మహేష్ సినిమా తరువాత బన్నీ సినిమాకు కనుక గ్యాప్ వస్తే నానితో సినిమా చేసే ఆలోచన త్రివిక్రమ్ చేస్తున్నారనే గ్యాసిప్ బలంగా వినిపిస్తోంది. అందులో నిజమెంతో తెలియదు. కానీ ఈ మధ్య నాని ఓ ఇంటర్వూలో, ఇండైరెక్ట్ గా వుంటుందేమో అనే సంకేతం ఇచ్చారు.
ఆ సంగతి అలా వుంచితే రవితేజ, బాలయ్య లాంటి సీనియర్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్న వారు, అలాగే మెగాస్టార్ తో ఓ సినిమా చేస్తేనా అనుకుంటున్న దర్శకులు అంతా 2025 సంక్రాంతి మీదే దృష్టి పెట్టారు. ఇప్పటికి నిర్మాణంలో వున్న సినిమాలు అన్నీ 2024 లో విడుదలైపోతాయి. కొత్తగా ప్లాన్ చేసినవి మాత్రమే 2025 సంక్రాంతికి వెళ్తాయి. అందుకే ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు చాలా మంది.