పుష్ప-2 సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఎప్పుడు రీ-స్టార్ట్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. దీనికితోడు దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ మధ్య పొరపొచ్చాలు వచ్చాయంటూ ఊహాగానాలు.
ఇప్పుడీ పుకార్లకు మరింత ఊతమిస్తూ బన్నీ గడ్డం తీసేశాడు. తన విదేశీ పర్యటనలో ట్రిమ్ చేసిన గడ్డంతో కనిపించాడు. పుష్ప-2 సినిమా ఆసాంతం గుబురు గడ్డంతో కనిపించాలి. కానీ ఉన్నట్టుండి సడెన్ గా గడ్డం ట్రిమ్ చేశాడు అల్లు అర్జున్.
దీంతో పుష్ప-2 సినిమాపై మరిన్ని అనుమానాలు పెరిగాయి. వీటన్నింటినీ తగ్గించే ప్రయత్నం చేసింది యూనిట్. బన్నీ గడ్డం అడ్డం కాదని వివరణ ఇస్తోంది.
కొత్త షెడ్యూల్ ప్రారంభమవ్వడానికి ఇంకా చాలా టైమ్ పడుతుందంట. కాబట్టి అప్పటికి బన్నీ మళ్లీ గుబురు గడ్డంతో రెడీ అయిపోతాడనేది యూనిట్ నుంచి వచ్చిన సమాచారం.
అయితే మేకర్స్ చెబుతున్నట్టు షూటింగ్ కు మరీ ఏమంత ఎక్కువ టైమ్ లేదు. ఈ నెలాఖరుకే పుష్ప-2 కొత్త షెడ్యూల్ ఉంది. మరి అప్పటికి బన్నీ రెడీ అయిపోతాడా? లేక బన్నీతో సంబంధం లేని సన్నివేశాలు తీస్తారా? అసలు ఆ టైమ్ కు సుకుమార్ అందుబాటులోకి వస్తాడా రాడా?
ప్రస్తుతం పుష్ప-2 చుట్టూ తిరుగుతున్న సందేహాలివి. వివరణలతో వీటికి నివృత్తి ఉండదు. సెట్స్ పైకి రావాలి, సినిమా అప్ డేట్ ఇవ్వాలి, రిలీజ్ డేట్ పై మరోసారి స్పష్టత ఇవ్వాలి. అలా పుకార్లకు చెక్ పెట్టాలి.