కూటమిని వెనకేసుకొచ్చేలా మాట్లాడ్డానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఉత్సాహం కనబరుస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్‌కు షర్మిల సారథ్యం వహించినంత కాలం, ఆ రాష్ట్రంలో ఆ పార్టీ ఎదుగుదలపై ఆశలు వదులుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ, కూటమి తరపున ఆమె వాయిస్ వినిపించడం ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే దేని లెక్క దానికుంటుంది?
ఇదేంటి కాంగ్రెస్ నాయకురాలిగా వుంటూ, బీజేపీ భాగస్వామ్యం వహించిన కూటమికి షర్మిల వత్తాసు పలుకుతోందని, ఆమెకు ఏమైనా తిక్క వుందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించే వాళ్లకే తిక్క అని షర్మిల మనసులో తెగ సంతోష పడుతూ వుంటుంది. తానెందుకు అలా మాట్లాడుతున్నదో ఆమెకు మాత్రమే బాగా తెలుసు.
తన అన్న వైఎస్ జగన్‌పై వ్యక్తిగత కక్ష తీర్చుకోడానికి రాజకీయం అనే ముసుగులో విమర్శనాస్త్రాల్ని ఆమె సంధిస్తున్నారు. ఇంతకు మించి ఆమెకు ఏ ఆశయమూ లేదని ఇటీవలి ఎన్నికల ప్రచారంలో స్పష్టమైంది. షర్మిలలో మరో గొప్ప అవలక్షణం ఏంటంటే... పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భయం లేకపోవడం. అందుకే ఆమె అంత బరితెగించారని గిట్టని వారు విమర్శిస్తుంటారు.
తల్లికి వందనం పథకాన్ని ప్రతి విద్యార్థికి అందిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊదరగొట్టారని షర్మిల చెబుతూనే, వెంటనే తన అన్న జగన్ పాలనను తెరపైకి తీసుకొచ్చారు. వైఎస్ జగన్ కూడా ఇలాగే హామీ ఇచ్చారని, తనతో కూడా ప్రచారం చేయించారని పచ్చి అబద్ధాల్ని ఆమె చెప్పారు. పిల్లల్ని చదివించే ప్రతి తల్లికి రూ.15 వేలు అందిస్తామని వైసీపీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించింది.
షర్మిల బరితెగింపు ఏ స్థాయిలో వుందంటే... టీడీపీ కూడా ఎప్పుడూ అందరికీ అని చెప్పి, ఒకరికే ఇస్తున్నారనే అని ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఏదో ఒకటి విమర్శించాలనే ఆత్రుత ఉన్న నాయకులు మాత్రమే అమ్మ ఒడి పథకానికి సంబంధించి జగన్‌ను విమర్శించారు. కానీ షర్మిల మాత్రం కూటమి నేతల కళ్లల్లో ఆనందం చూసేందుకు... అబ్బే అప్పుడు మా అన్న కూడా ఇట్లే హామీ ఇచ్చాడని , తనతో కూడా ప్రచారం చేయించాడని చెప్పడం ద్వారా వారికి ఒక ఆయుధం అందించానని స్వయంతృప్తి పొందారు.
ఊరికే కూటమి నేతలకు మద్దతుగా షర్మిల మాట్లాడ్డానికి ఆమె అమాయకురాలు కాదనే విమర్శ వుంది. రాజకీయాల్లో స్పాన్సర్డ్ కార్యక్రమాలు చేపట్టడంలో ఏ నాయకుడు ఆరితేరారో అందరికీ తెలుసు అంటున్నారు. ఇప్పుడు ఆయనే షర్మిలతో చిలుకపలుకులు పలికిస్తున్నారనే ఆరోపణను కొట్టి పారేయలేని పరిస్థితి. జగన్‌పై షర్మిల విమర్శలు, ఆమెకు ఏమైనా తిక్కా అనే అనుమానం కలిగించి వుండొచ్చు. కానీ దానికో లెక్క వుందని విమర్శించే వాళ్లను కాదనగలమా? షర్మిలకు వందనం అనే పథకం అమలవుతూ వుందేమో అనే అనుమానాలు కోకొల్లలు. నిప్పు లేనిదే పొగ రాదు కదా!