Bharateeyudu 2 Review: మూవీ రివ్యూ: భారతీయుడు-2

చిత్రం: భారతీయుడు-2
రేటింగ్: 2/5
తారాగణం:
కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్, ప్రియ భవాని శంకర్, బాబీ సింహ, నెడుముడి వేణు, వివేక్, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, మనోబాల, జాకిర్ హుస్సేన్ తదితరులు
కథ: శంకర్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: సుభాస్కరన్
దర్శకత్వం: శంకర్
విడుదల: 12 జూలై 2024 

కమల్ హాసన్ "భారతీయుడు" 1996లో ఒక ఊపు ఊపిన చిత్రం. దానికి సీక్వెల్ అంటే ఆ జనెరేషన్ ప్రేక్షకులకి కూడా ఉత్సాహం రావడం సహజం. ఈ మధ్యన "విక్రం" తో కమల్ పెద్ద హిట్ కొట్టి ఫాం లో ఉన్నారు. కనుక ఈ తరం ప్రేక్షకులకి కూడా కమల్ మీద ఆసక్తి ఉంది. వెరసి "భారతీయుడు-2" కి ప్రేక్షకాదరణ బాగానే ఉంటుందన్న సంకేతాలొచ్చాయి. 

కథలోకి వెళ్లితే చిత్ర అరవింద్ (సిద్ధార్థ్) "బార్కింగ్ డాగ్స్" పేరుతో ఒక యూట్యూబ్ చానల్ నడుపుతుంటాడు. లంచగొండులని ఎక్స్పోజ్ చేయడం అతని చానల్ ముఖ్యోద్దేశం. 

టీచర్ ఉద్యోగానికి లంచం అడగడంతో చేసేది లేక బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఒక అమ్మాయిని చూసి, మళ్లీ భారతీయుడు రావాలని "కం బ్యాక్ ఇండియన్" అనే హ్యాష్ టాగ్ తో ప్రచారం మొదలుపెడతాడు చిత్ర అరవింద్.  Readmore!

ఇంతకీ భారతీయుడు తైవాన్ లోని టైపీలో ఉంటున్నాడని తెలుస్తుంది. 1996 లో దేశం నుంచి తప్పించుకుని వెళ్లిపోయిన సేనాపతి అనబడే భారతీయుడు టైపీలోనే ఉంటున్నాడు. అరవింద్ పిలుపుకి లక్షలాది పిలుపులు తోడవడంతో సేనాపతి తిరిగి ఇండియాలో అడుగుపెట్టి ఒక సందేశం ఇస్తాడు. 

ఆ సందేశాన్ని ఆచరణలో పెడుతున్న అతని అభిమానులు కొత్త ఇబ్బందులకి గురవుతారు. అవేమిటి? వాటి పర్యవసానాలు సేనాపతిపై ఎలా పడ్డాయి? అనేది సినిమా. 

ఈ కథలోనూ, కథనంలోనూ ప్రధానమైన మైనస్ ఏంటంటే ఒక ఆర్గానిక్ ఫ్లో లేకుండా ఎక్కడికక్కడ కేవలం సంఘటనలు పేర్చినట్టు మాత్రమే ఉండడం. సీరియస్ మ్యాటర్ తెర మీద నడుస్తుంటే మధ్యలో క్యారికేచర్లతో కామెడీ వస్తుంటుంది. అది దేనికో అర్ధం కాదు. 

కమల్ హాసన్ పాత్ర ఎంట్రీకి బిల్డప్ ఉంది కానీ, ఆ పాత్ర ప్రవేశించిన తర్వాత నీరసం, నిరాశ, నిస్పృహ ఆవహిస్తాయి. మధ్య మధ్యలో అరవ డైలాగులు కవితాత్మకంగా చెప్పేస్తూ ఉంటాడు. దానికి తెలుగు డబ్బింగ్ ఎందుకు చేయలేదో మరి! డబ్బింగ్ చేసేవాళ్ళకే అర్ధం కాలేదా? 

యాక్షన్ సన్నివేశాలు పరమ దారుణంగా ఆద్యంతం ట్రోలింగ్ చేసుకునే విధంగా ఉన్నాయి. పాటలు ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకునే విధంగా లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇప్పటి స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే సరిపోదు. 

శంకర్ సినిమాల స్థాయిలో లేదిది. ఏదో తీయాలని ఏదేదో తీసేయడం వల్ల, పాయింటులో బలం లేక, కథనంలో పటుత్వం లేక అంచనల దరిదాపుల్లోకి రాకుండా ఆగిపోయిన చిత్రమిది. 

కమల్ హాసన్ కష్టాన్ని విమర్శించడానికి ఏం లేదు. నటన పరంగా తనని కొట్టినవాడు లేడని ఎవరన్నా చెప్తారు. కానీ ఆ నటుడు పోషించిన పాత్రని బలంగా, హుందాగా, తెలివిగా, ఎమోషనల్ గా నడపాల్సిన బాధ్యత దర్శకుడిది. అది తప్పేసరికి కమల్ కష్టం కూడా వృధా అయింది. 

రకుల్ ప్రీత్ సింగ్ రెండు మూడు సార్లు కనిపించి అరుస్తూ ఏవో డైలాగులు చెప్పి వెళ్లిపోయే కేమియో క్యారక్టర్ లా ఉంది. 

సిద్ధార్థ్ ది ఇందులో ప్రధాన పాత్ర. దేశాన్ని లంచరహిత సమాజంగా చూడలని అతని కోరిక. ఆ పాత్రలో తాను ఎంత జీవించినా రాసుకున్న విధానంలో డ్రామా పండకపోవడం వల్ల ఏ రకంగానూ హత్తుకోడు. కానీ ఉన్నంతలో భావోద్వేగాల్ని పండించే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు. 

ప్రియ భవాని శంకర్ కి కాస్త లెంగ్త్, డైనమిక్స్ ఉన్న పాత్రే. అయినా కానీ ఈ ఎమెచ్యూర్ కథనంలో ఆమె కూడా ఎమెచ్యూర్ గానే కనిపిస్తుంది. 

బాబీ సింహా ఉన్నంతలో తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేసాడు. "భారతీయుడు" నుంచి కమల్ తో పాటు కంటిన్యూ అయిన ఏకైక పాత్ర నెడుముడి వేణు.

ఎస్జే సూర్య కావాల్సినంత ఓవరాక్షన్ చేసి విసిగించాడు. సముద్రఖని బ్యాలెన్స్డ్ గా నటించాడు.  

బ్రహ్మానందం ఒక సీన్లో కనిపించాడు కానీ, ఎందుకు కనిపించాడో అర్ధం కాదు.  

భారతీయుడి కం-బ్యాక్ గురించి డిస్కషన్ లో "ఐడియా బానే ఉంది కానీ ఒప్పుకోలేకపోతున్నాను" అని హీరోయిన్ మొదట్లో ఒక డైలాగ్ చెబుతుంది. అసలీ కథ అనుకున్నప్పుడు కమల్ హాసన్ కూడా శంకర్ తో ఈ లైన్ అని ఉండాలి. అయినా సరే.. ఏం కన్విన్స్ చేసి తీసాడో కానీ ప్రేక్షకుల్ని ఒప్పించేలా మాత్రం లేదు. 

చెత్త టెండర్లలో అవినీతి, విద్యారుణం తీర్చలేక ఒక పేద విద్యార్థి ఆత్మహత్య, టీచర్ ఉద్యోగానికి 8 లక్షల లంచం, యూట్యూబులో చూస్తూ ఆపరేషన్ చేసే సర్జన్, క్వారీలు తవ్వి కోట్లు సంపాదించినవాడికి భారతీయుడు విధించిన "గుర్రం చావు... ఇలా ఒకటి కాదు.. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా అతుకుల బొంతలాగ తెర మీద కథ నడుస్తూనే ఉంటుంది. 

అసలు మర్మకళ పేరుతో ఎక్కడో కొడితే మనిషి గుర్రంలా ఊరంతా పరుగెత్తి రక్తం కక్కుకుని చచ్చిపోవడమేంటో! ఎంత క్రియేటివిటీ అనుకున్నా అది కామెడీగా ఉంది తప్ప కన్విన్సింగ్ గా లేదు. 

ఇంటర్వల్ సన్నివేశం చిరాకు పెట్టడంతో అదే క్లైమాక్స్ అనుకుని వెళ్లిపోవాలనిపిస్తుంది చాలమంది ప్రేక్షకులకి. 

1996 "భారతీయుడు" ఒక ట్రెండ్ సెట్టెర్. లంచగొండితనం వల్ల అమాయకులు ఎలా బలౌతున్నారో చూపిస్తే ప్రేక్షకులు ఎమోషనల్ అయిపోయి చూసారు. భారతీయుడు లాంటి వాడు ఉంటే తప్ప దేశం బాగుపడదన్న కన్విక్షన్ తో కథ నడిపించాడు దర్శకుడు. సొల్యూషన్ అది అయినా కాకపోయినా తెర మీద ఎమోషన్ అద్భుతంగా పండింది. అందుకే ఆడింది. 

మళ్లీ 28 ఏళ్ల తర్వాత భారతీయుడు-2 అంటూ ముందుకొచ్చాడు. కాలం 2024 లోకి వచ్చింది కానీ శంకర్ మాత్రం 1996లోనే ఉండిపోయాడు. ప్రస్తుతం లంచగొండితనం పెద్ద టాపిక్ గా లేదు. అడపా దడపా లంచం తీసుకుంటూ పట్టుబడ్డవాళ్లని, ఏసీబీ దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులున్నవాళ్లని మీడియాలో చూస్తున్నా కానీ, కామన్ మ్యాన్ విక్టిం గా కనిపిస్తున్న దాఖలాలు తక్కువ. కాబట్టి లంచం మీద సినిమాని ఆదరించడానికి ఇది 90 వ దశకం కాదు. 

కానీ శంకర్ భారతీయుడు అనే హిట్ ఫ్రాంచైజ్ ని కొనసాగించాలనుకున్నాడు. ప్రస్తుతం సమాజంలో ఉన్న అవినీతిని ఎక్స్పోజ్ చేస్తూ తీయాలనుకున్నాడు. విజయ్ మాల్య, నీరవ్ మోదీ లాంటి వాళ్లని గుర్తు చేసేలా ఒకటి రెండు పాత్రలు రాసుకుని వాళ్లని వెంటాడి చంపడం ఒక ట్రాక్ గా పెట్టుకున్నాడు. కానీ తెర మీద వాళ్ల వల్ల బాధపడిన సరైన విక్టిం కనిపించనప్పుడు పాపం వాళ్లని ఈ పిచ్చి భారతీయుడు ఎందుకు చంపుతున్నాడా అనిపిస్తుంది. 

ఇంతకీ భారతీయుడు 1996 వెర్షన్ లోనే దాదాపు 70 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడు. అంటే ప్రస్తుతం సుమారు 100 ఏళ్లు ఉండాలి. బతికి ఉండడం సాధ్యమా? ఉన్నా వీరోచితమైన స్టంట్లు అవీ చేయడం కుదురుతుందా? ఈ ప్రశ్నలు వేసుకుని కూడా దానికి సమాధానం చెప్పకుండా, భారతీయుడు అంటే నిత్యవృద్ధాప్యంలో కనిపించే ఒక సూపర్ మ్యాన్ అన్నట్టుగా తీసుకుపోయాడు దర్శకుడు. 

దేశంలో అవినీతి పెరిగిపోయిందని "ఇండియన్ కం బ్యాక్" అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ మొదలెట్టి స్వాగతించినవాళ్ళే ఆ భారతీయుడిని దేశం వదిలి పొమ్మని గొడవ చేస్తారు చివర్లో. ఏదో ఉద్ధరిస్తాడనుకుని పిలిస్తే, వచ్చి అందర్నీ ఏడిపిస్తున్నాడని భారతీయుడిని ప్రజలే రాళ్లు పెట్టి కొడతారు. అది నిజానికి హాల్లో ప్రేక్షకుల ఫీలింగుతో సింక్ అవుతుంది. సీక్వెల్ తో మురిపిస్తాడనుకుంటే చిరాకుపెట్టి పంపించాడు. 

క్లైమాక్సులో తెర మీద పాత్రలన్నీ ముక్తకంఠంతో "గో బ్యాక్ ఇండియన్" అని నినాదాలు చేస్తే, భారతీయుడు మాత్రం తెర మీద నుంచి ప్రేక్షకులకి చేయి ఊపుతూ "ఐ విల్ కం బ్యాక్" అంటూ నిష్క్రమిస్తాడు. అంటే పార్ట్-3 అనే థర్డ్ డిగ్రీకి రెడీ అవ్వమని చెప్పినట్టుంది. 

రోలింగ్ టైటిల్స్ అయ్యాక భారతీయుడు-3 ని కాస్త కంటికి చూపించి ఆపాడు. 

బాటం లైన్: "శిరోభార"తీయుడు

Show comments

Related Stories :