ఏపీ అసెంబ్లీకి స్పీకరు కావాలని కలలు కన్నటువంటి, ఆ కలలు చెదిరినటువంటి నాయకుడి చేతికి ఉపశమనంలాగా చంద్రబాబునాయుడు టీటీడీ అధ్యక్ష పదవిని కట్టబెట్టబోతున్నారా? అనే ఊహాగానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఒకవైపు నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చిన నాయకుడికి.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినదే చాలా ఎక్కువ. మళ్లీ అత్యంత కీలకమైన టీటీడీ పదవిని కూడా కట్టబెడతారా అని సొంత పార్టీలోనే పెదవి విరుస్తున్నారు. మొత్తానికి ఉండి ఎమ్మెల్యే రఘురామక్రిష్ణ రాజుకు టీటీడీ ధర్మకర్తల మండలి సారథ్యం దక్కుతుందనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది.
రఘురామక్రిష్ణ రాజు.. ఏపీ శాసనసభకు స్పీకరు కావాలని కలగన్నారు. చంద్రబాబు తనకు ఉండి టికెట్ కేటాయించడానికి ముందు నుంచి కూడా.. ఆయన తనను స్పీకరు సీటులో చూడాలని తన మిత్రులు, ఆత్మీయులు కోరుకుంటున్నట్టుగా పలుమార్లు చెప్పారు. ఎంపీ టికెట్ రాకపోయిన.. ఉండి ఎమ్మెల్యే టికెట్ అయితే దక్కించుకున్నారు. గెలిచారు. కానీ.. స్పీకరు కావాలని అనుకున్న ఆయన కల మాత్రం తీరలేదు. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు టీటీడీ అధ్యక్ష పదవికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
నిజానికి ఈ పదవిని సీనియర్ నాయకుడు, అశోక్ గజపతి రాజుకు ఇస్తారనే ఊహాగానాలు బాగా వినిపించాయి. అదే సమయంలో ఆయన గవర్నరు పోస్టు ఆశిస్తున్నారు తప్ప.. టీటీడీ కి సుముఖంగా లేరనే వాదన వచ్చింది. అయితే.. కేంద్రమంత్రి హోదాలో పనిచేసిన తాను.. ఎవరెవరో వీఐపీలు వస్తూఉంటే వారందరికీ వెళ్లి బొకేలు ఇచ్చి మర్యాదలు చేస్తూ ఉండాలా.. అలాంటి పదవి నాకు అక్కర్లేదు.. అని అశోక్ తిరస్కరించినట్టుగా సమాచారం. ప్రత్యామ్నాయాల అన్వేషణలో భాగంగా.. రఘురామకు ఇస్తారనే ప్రచారం బాగా జరుగుతోంది.
అదే సమయంలో- చంద్రబాబుతో జట్టుకట్టడం వలన ఎమ్మెల్సీ పదవిని కూడా కోల్పోయిన జంగా కృష్ణమూర్తికి ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. గతంలో జగన్ టీటీడీ పదవి ఆశచూపి, జంగాకు ఇవ్వలేదనే ప్రచారం ఉంది. అందుకే ఆయన తెదేపాలో చేరినట్టు చెబుతుంటారు. తీరా ఇప్పుడు.. రఘురామ పేరు బలంగా వినిపిస్తోంది. మరి చంద్రబాబు ఎలాంటి కాంబినేషన్ తో ముందుకెళ్తారో చూడాలి.