కీలక సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రానికి నిధులు, ఇతరత్రా అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు మొదటి సారి ఢిల్లీకి వెళ్లారు. కానీ పవన్‌ను తీసుకెళ్లలేదు. తాజాగా శనివారం సాయంత్రం హైదరాబాద్ ప్రజాభవన్‌లో ఏపీ విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు.
కీలకమైన ఈ సమావేశానికి కూడా పవన్‌కల్యాణ్ వెళ్లకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొంటున్నారు. రేవంత్‌రెడ్డి ఎక్కడికెళ్లినా ఉప ముఖ్యమంత్రి తప్పనిసరి. కానీ ఏపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు సర్కార్ కొలువుదీరిన మొదట్లో పవన్‌కు విపరీత ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది.
ఆ తర్వాత నెమ్మదిగా పవన్‌కు ప్రాధాన్యం తగ్గుతోందన్న చర్చ మొదలైంది. కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబుతో పాటు పవన్‌కల్యాణ్ ఫొటో కూడా ముద్రించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌ను రూ.4 వేలకు ప్రభుత్వం పెంచింది. ఘనంగా నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్‌కల్యాణ్ ఫొటో కనిపించలేదు.
ఆ తర్వాత బాబు ఢిల్లీ పర్యటనలో పవన్ లేరు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై నిర్వహించే కీలక సమావేశానికి పవన్‌కల్యాణ్ వెళ్లకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు హాజరవుతున్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, అనగాణి సత్యప్రసాద్, కందుల దుర్గేశ్ హాజరవుతున్నారు.
జనసేన తరపున కందుల దుర్గేశ్‌ను కేవలం మొక్కుబడిగా తీసుకెళుతున్నారనే మాట వినిపిస్తోంది. ఎందుకిలా జరుగుతోందన్న చర్చ ముఖ్యంగా జనసేనలో చోటు చేసుకోవడం గమనార్హం. పవన్‌ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారా? లేక ఆయనే నెమ్మదిగా తప్పుకుంటున్నారా? అనే చర్చకు తెరలేచింది. పవన్ అంటీముట్టనట్టుగా ఉంటుండడంతో ఏదో జరుగుతోందన్న అభిప్రాయానికి చోటు ఇచ్చినట్టు అవుతోందని పలువురు అంటున్నారు.
ఎన్నికల ప్రచారం, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం, మంత్రుల కూర్పు, అనంతరం కొన్ని రోజులు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కలిసి ప్రయాణం సాగించారు. ఆ తర్వాత పోలవరం, అమరావతి తదితర కీలక ప్రాజెక్టుల సందర్భంలోనూ పవన్ కనిపించలేదు. తన వెంట పవన్ వుంటే, మీడియా అటెన్షన్ అంతా ఆయన వైపే వుంటుందని, ఉద్దేశంతోనే చంద్రబాబు దూరం పెడుతూ వస్తున్నారా? అనే అనుమానం జనసేన వ్యక్తం చేస్తోంది. ఏది ఏమైనా ముఖ్యమైన ప్రాజెక్టుల విషయాల్లో తనను చంద్రబాబు దూరం పెడుతుండడంతో పవన్‌కల్యాణ్ అలకబూనారనే చర్చ కూడా లేకపోలేదు.