సినిమా ఎలా వుంది అన్నది పాయింట్ కాదు. ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుంది అన్నది అసలు సంగతి. దేశంలో ప్రభాస్ క్రేజ్ అలా వుంది. సాహో నుంచి రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వరకు అన్నీ ప్రూవ్ చేసింది ఇదే. పరిస్థితి ఇలా వున్నపుడు సలార్ నిర్మాతలు తమ పార్ట్ 2 ను ఎందుకు పక్కన పెడతారు. వీలయినంత త్వరగా విడుదల చేయాలనుకుంటారు. డబ్బులు చేసుకోవాలనుకుంటారు. అందుకే సలార్ పార్ట్ 2 కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ మీద ప్రెషర్ పెరుగుతోంది.
సలార్ పూర్తయిన దగ్గర నుంచి అదిగో టూ.. ఇదిగో టూ.. అంటూ వార్తలు వస్తూనే వున్నాయి కానీ అవేవీ నిజం కావడం లేదు. దానికి కారణం ప్రశాంత్ నీల్ సలార్ 2 కన్నా ముందుగా మరో సినిమా చేయాలని అనుకోవడమే అని తెలుస్తోంది. ఈ విషయంలో నిర్మాతలు పట్టుదలగా వున్నారు కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాదని తెలుస్తోంది.
అదే సమయంలో దర్శకుడికి తను ఒప్పుకున్న మైత్రీ మూవీస్ నుంచి హీరో ఎన్టీఆర్ నుంచి కూడా వత్తిడి తప్పడం లేదు. సలార్ లో వున్న యంగ్ బాయ్స్ ఎపిసోడ్ చేసేసి పక్కన పెట్టాల్సి వుంది. ఎందుకంటే ఆ ఇద్దరు యంగ్ బాయ్స్ స్టేజ్ దాటిపోతున్నారు. దాని కోసం ఓ షెడ్యూలు చేసి పక్కన పెడతారని కూడా వార్తలు వున్నాయి.
ప్రస్తుతానికి అయితే ప్రశాంత్ నీల్ కు నిర్మాతల వైపు నుంచి ప్రెషర్ వున్న మాట వాస్తవం అని తెలుస్తోంది. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ మీదనే పూర్తిగా వర్క్ చేస్తూ వున్నారు. అందువల్ల సలార్ 2 అన్న సంగతి చూడాల్సిందే.
పైగా ప్రభాస్ కు కూడా కమిట్ మెంట్ లు వున్నాయి. రాజా సాబ్, హను రాఘవపూడి, స్పిరిట్ సినిమాలు పూర్తి చేయాలి. వీటి మధ్యలో మాత్రంమే సలార్ 2 చేయాలి. ఏ దర్శకుడు అయినా కూడా ఇలా ముక్క ముక్కలుగా సినిమా చేయడం కన్నా, ఒకేసారి మొదలుపెట్టి ఫినిష్ చేయాలనే అనుకుంటారు. అందువల్ల ఎన్టీఆర్ సినిమానే ముందుగా టేకప్ చేసే అవకాశం వుంది.