కనిపించకుండా పోయిన ఆడపిల్ల తిరిగి రావడం అంటే ఆ తల్లి తండ్రులకు అంతకన్నా ఆనందం వుండదు. ఆడపిల్లలు కనిపించకుండా పోవడానికి రెండే ప్రధాన కారణాలు. ఎవరినన్నా ప్రేమించి, వారితో వెళ్లిపోవడం. రెండవది హ్యూమన్ ట్రాఫికింగ్. వ్యభిచార ఊబిలోకి బలంగా దింపేయడం.సాధారణంగా రెండు కేసుల్లోనూ పోలీసులకు ఫిర్యాదులు వస్తాయి. మిస్సింగ్ కేసుగా రిజిస్టర్ చేసుకుని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందిస్తారు. అంతకు మించి అడుగు ముందుకు పడాలంటే చాలా కష్టం. ఎందుకంటే పోలీసులుకు వున్న పని వత్తిడి అలాంటిది. పై నుంచి ప్రెజర్ వుంటే కాస్త ఎక్కువ దృష్టి పెడతారు. లేదంటే ఇలాంటి కేసులు అలా వుంటాయి.
మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఇలాంటి కేసు ఒకటి వచ్చింది. వెంటనే పోలీసులను ఆదేశించారు. రోజుల్లో పని జరిగిపోయింది. జమ్మూలో వున్న అమ్మాయిని వెనక్కు రప్పించారు. ఎవరితో వెళ్లింది ఆ అమ్మాయి. ఎందుకు వెళ్లింది..అసలు ఏమిటి సంగతి అనే దాని కన్నా పవన్ కళ్యాణ్ ఎంత త్వరగా ఈ కేసును పరిష్కారం దిశగా నడిపారు అనేదే ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది.
అధికారంలోకి రాక ముందు పవన్ ఓ తీవ్రమైన ఆరోపణ చేసారు. కొన్ని వేల మంది మహిళలు ఆంధ్ర రాష్ట్రం నుంచి కనిపించకుండా పోయారు అన్నదే ఆ ఆరోపణ. ఇప్పుడు పవన్ చేతిలో అధికారం వుంది. ఈ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆయన. అందువల్ల ఈ ఒక్క కేసు అది కూడా ప్రేమించిన వాడితోనో లేక అమాయకంగా మాటలు నమ్మి మోసపోయి వెళ్లిన కేసు.
ఇది కాకుండా మిస్ అయిపోయి, అమ్ముడు పోయి, వ్యభిచార కూపాల్లో మగ్గుతున్నారేమో అని అనుమానం పడుతున్న వేల మంది మహిళల మిస్సింగ్ కేసుల పరిశోధన కూడా వేగవంతం చేయాలి. అవసరం అయితే ఇలాంటి కేసులు అన్నీ ఓ ప్రత్యేక టీమ్ కు బదలాయించి దర్యాప్తు జరిపించాలి.
ప్రేమించిన వాడితో వెళ్లిపోయిన కేసులు పరిష్కారం కాస్త సులువు. పోలీసులు తలుచుకుంటే ఇలాంటి కేసులు వేగంగా పరిష్కారం అవుతాయి. అలా కాకుండా వేరే తరహా కేసులు దర్యాప్తు కాస్త జటిలం. అందువల్ల వాటి మీదే కాస్త గట్టి దృష్టి పెట్టేలా పవన్ ఆదేశాలు ఇవ్వాలి.