ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైన టీడీపీ, ఢిల్లీలో ఇండియా కూటమి నేతలతో సన్నిహితంగా మెలుగుతోంది. టీడీపీ పార్లమెంటరీ పక్ష నాయకుడైన లావు శ్రీకృష్ణదేవరాయలు, అలాగే ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు ఢిల్లీలో ఎన్డీఏ నేతల కంటే ఇండియా కూటమి నేతలతోనే సన్నిహితంగా మెలుగుతున్నారని సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో స్నేహంగా మెలగడం చర్చనీయాంశమైంది.
ఇటీవల ఎన్నికల్లో బీజేపీ అనుకున్న మేరకు సీట్లు సాధించలేకపోయింది. చంద్రబాబునాయుడు, నితీశ్‌కుమార్ మద్దతుతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఇద్దరు నాయకులు మద్దతు ఉపసంహరించుకుంటే, ఏ క్షణమైనా మోదీ సర్కార్ కూలిపోతుంది. భవిష్యత్‌లో ఇండియా కూటమిదే అధికారం అనే చర్చకు తెరలేచింది. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమికి సానుకూల వాతావరణం క్రమంగా పెరుగుతోందన్నది వాస్తవం.
చంద్రబాబు ముందు చూపున్న నాయకుడు. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలదే భవిష్యత్ అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో తన మార్క్ రాజకీయానికి ఆయన తెరలేపారు. ఎన్డీఏ కూటమిలో వుంటున్నప్పటికీ, ఇండియా కూటమితో కూడా స్నేహ సంబంధాలు ఆయన కొనసాగిస్తున్నారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ అభ్యర్థిని ఎంపిక చేస్తే తాము మద్దతు ఇస్తామని ఇండియా కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాజకీయంగా చొరవ చూపగలిగే లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో ఇండియా కూటమి నేతలతో లాబీయింగ్ చేస్తున్నారని తెలిసింది. వారితో విందులు, వినోదాలతో గడుపుతున్నారని సమాచారం. ఇవన్నీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
వైసీపీ పరిస్థితి విచిత్రంగా వుంది. ఎక్కడైనా శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు. అదేంటో గానీ, వైసీపీ మాత్రం తన శత్రువుకు శత్రువుని మిత్రుడిగా చూడడం లేదు. శత్రువుగానే చూస్తోంది. ఏపీలో ఎన్డీఏతో రాజకీయంగా తలపడి ఘోర పరాజయాన్ని మూట కట్టుకోంది. ఢిల్లీలో ఎన్డీఏ కూటమికి రాజకీయ శత్రువైన ఇండియా కూటమితో వైసీపీకి స్నేహ సంబంధాలు ఉండాల్సింది. కానీ లేవు. బీజేపీ కంటే వైసీపీనే కాంగ్రెస్‌ను శత్రువుగా భావిస్తోంది.
అందుకే రాహుల్‌గాంధీ, ఇతర ఇండియా కూటమి నేతలతో వైసీపీ ఎంపీలు కనీసం మాట్లాడేందుకు కూడా భయపడుతారు. తమ నాయకుడు జగన్‌కు తెలిస్తే ఏమవుతుందో అని వారు నోరు మూసుకుని, అందరికీ దూరంగా వుంటున్నారు. రాజకీయాల్లో ఇది ఎంత వరకు సమంజసమో వారికే తెలియాలి. టీడీపీ మాత్రం ఎన్డీఏలో ఉన్నప్పటికీ, ఇండియా కూటమితో చక్కటి స్నేహ సంబంధాలను నెరపుతోంది. రాజకీయం అంటే ఇదే కదా!