బాలయ్య వద్దన్నారా.. బాబు కట్ చేశారా?

బాలయ్య అంటేనే ఉరకలెత్తే ఉత్సాహం. మరీ ముఖ్యంగా ఫంక్షన్లలో ఆయన హడావుడి మామూలుగా ఉండదు. అలాంటి వ్యక్తి 2 రోజులుగా పెద్దగా బయట కనిపించలేదు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో బాలయ్య చాలా ముభావంగా ఉన్నట్టు అనిపించింది.

ఓవైపు బావ ప్రమాణ స్వీకారం, మరోవైపు అల్లుడు ప్రమాణ స్వీకారం.. ఇంకోవైపు తన కుటుంబ సభ్యుల ఆనందం. అంతా ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లా కనిపించింది. అయినప్పటికీ బాలయ్య కళ్లల్లో ఆనందం కనిపించలేదు, స్టేజ్ పై రెగ్యులర్ గా చూపించే ఉత్సాహం ఈరోజు లేదు. ఆయన ఎందుకో సీరియస్ గా ఉన్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ లో జోష్ కనిపించలేదు. దీంతో సరికొత్త చర్చకు తెరలేచింది.

మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే బాలయ్య ఇలా మూతి ముడుచుకున్నారనే కొత్త చర్చ మొదలైంది. నిజానికి మంత్రి పదవికి అన్ని విధాలుగా అర్హుడు బాలయ్య. వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారాయన. అంతకంటే అర్హత ఇంకేం కావాలి. అయినప్పటికీ ఆయనకు పదవి దక్కలేదు. బాలయ్యే తనకు మంత్రి పదవి అక్కర్లేదని హుందాగా తప్పుకున్నారా.. లేక చంద్రబాబు తన 'తెలివితేటల'తో బాలయ్యను తప్పించారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

కొత్తవాళ్ల కంటే ఏం తక్కువ.. Readmore!

ఈసారి మంత్రివర్గంలో  కొత్త ముఖాలు ఎక్కువగా కనిపించాయి. తొలిసారి మంత్రి పదవి అందుకున్న నేతలే కాదు, తొలిసారి ఇలా గెలిచి అలా మంత్రివర్గంలో చేరిన వాళ్లు కూడా ఉన్నారు. బాలయ్యను కాదని వీళ్లందర్నీ తన మంత్రివర్గంలోకి తీసుకునేంత అమాయకుడు కాదు చంద్రబాబు. ఒకవేళ నిజంగా తన చాణక్యంతో బాలయ్యను కట్ చేసినట్టయితే.. ఈ ముభావానికి కచ్చితంగా ఇదే కారణం అవుతుంది.

నిజానికి బాలయ్య ఎప్పుడూ పదవులు ఆశించలేదు. నిజంగా పోర్టుపోలియో కావాలనుకుంటే, ఆయన 2014లోనే మంత్రి అయ్యేవారు. కానీ ఈసారి పరిస్థితులు వేరు. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గినట్టు ఆయన ఫీల్ అవుతున్నట్టుంది.

పవన్ కు అధిక ప్రాధాన్యం..

ఫలితాలు వచ్చిన రోజు నుంచి పవన్ కల్యాణ్ కు అత్యథిక ప్రాధాన్యం ఇస్తున్నారు చంద్రబాబు. పవన్ ఇంటికెళ్లి మరీ కౌగిలించుకున్నారు. తనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకునే కార్యక్రమంలో కూడా పవన్ కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా చంద్రబాబు ఇదే పంథా అనుసరించారు.

ఇవి చాలదన్నట్టు పవన్ ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖను ఇచ్చేలా ఉన్నారు. ఈ పరిణామాలన్నీ బాలయ్యకు ఇబ్బందికరంగా తోస్తున్నట్టున్నాయి. పైగా ఈరోజు సభలో తన ప్రొఫెషనల్ ప్రత్యర్థి చిరంజీవికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ ఆహ్వానించాల్సి రావడం బాలయ్యకు ఇబ్బందికరంగా మారినట్టుంది.

ఇలా చెప్పుకుంటూపోతే చాలానే కారణాలు కనిపిస్తాయి. మరో కోణంలో ఆలోచిస్తే ఇవేవీ పెద్ద కారణాలు కూడా కాకపోవచ్చు. మరి ఆయన ఎందుకంత ముభావంగా ఉన్నారు. 

Show comments

Related Stories :