మోదీ కేబినెట్‌లో టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్ ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మొదటిసారి ఎంపీగా గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు మంత్రి పదవులు ఖాయమైనట్టు సమాచారం. రామ్మోహన్‌నాయుడికి కేబినెట్ హోదా, అలాగే పెమ్మసానికి సహాయ మంత్రిత్వ శాఖ ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ ఇద్దరిలో పెమ్మసాని అదృష్టవంతుడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఎవరూ ఊహించని విధంగా రాజకీయ తెరపైకి పెమ్మసాని వచ్చారు. బాబు సామాజిక వర్గానికి చెందిన పెమ్మసాని విదేశాల్లో వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. దేశంలోనే అత్యంత సంపన్నమైన ఎంపీగా ఆయన గుర్తింపు పొందారు. ఎన్నికల అఫిడవిట్‌లోనే వేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులకు యజమానిగా ఆయన చూపించుకున్నారు.
బహుశా ఈ కారణమే కావచ్చు...కేంద్ర మంత్రి పదవి దక్కడానికి. ఎన్నికల్లో ఆయన భారీ మొత్తంలో టీడీపీ కోసం ఖర్చు పెట్టారనే వార్తలు వచ్చాయి. పెమ్మసాని పార్టీ కోసం ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడడంతో, చంద్రబాబు కృతజ్ఞతగా మంత్రి పదవి ఇప్పించడానికి మొగ్గు చూపారని అంటున్నారు. టీడీపీలో సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ, ప్రత్యేక కారణాల రీత్యా పెమ్మసాని వైపు చంద్రబాబు నిలిచారని అనుకోవచ్చు.
ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఆర్థిక వనరులు ఎంతో కీలకం. అందుకే పెమ్మసాని చంద్రశేఖర్‌ను చంద్రబాబు అదే పనిగా రాజకీయాల్లోకి ఆహ్వానించారు. చంద్రబాబు ప్రయత్నం ఫలించింది. రాజకీయాల్లోకి వచ్చీరాగానే పెమ్మసానిని అదృష్టం వరించింది. ఎంపీ కావడం, ఆ తర్వాత కేంద్ర మంత్రి కానుండడం అదృష్టం కాకుండా మరేంటి?